అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 18, 2016

ఒరేయ్ దళితుడా..


ఒరేయ్ దళితుడా..
అది కంచకచర్లైనా, కారంచేడైనా , చుండూరయినా, లక్షిం పేటయినా..
నీ చావు ఓ వార్త మాత్రమేరా.. టీవీలకు ఓ సెన్సేషన్ న్యూసేరా..?
నిన్ను 3000 సం.ల క్రితమే ఊరి చివరికి విసిరి పారేశాం..
ఇప్పటికీ గుడి మెట్టునే తొక్కనీయడం లేదు..
బడిలోపల ఎలా ఎదగనిస్తామనుకున్నావ్ రా..?

గత రెండు సంవత్సరాల నుండి అదే యూనివర్సిటీలో 9 మంది దళిత విద్యార్థులను చంపేశాం..
అప్పుడెవడేం పీకాడురా..?
ఇప్పుడో 'దళిత' విద్యార్థి 'ఆత్మహత్య' చేసుకున్నాడంటూ.. అన్ని మీడియాల కెమెరా లెన్స్  HCUపైకి జూమ్ చేశాయి..
వాటికి నీ చావు మీద జాలిలేదురోయ్.. ఆ వార్త ఇచ్చే రేటింగ్ పై మోజు మాత్రమే...

ఎవడు కూసాడు రా నీది ఆత్మహత్య అనీ..
హైదరాబాద్ బాద్ నడిబొడ్డులో.. ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన 'మర్డర్'..
'ప్లాన్డ్ మర్డర్'..
మనువాద హిందూ విద్యార్థి సంఘం ఏబీవీపీ కుట్రపన్నింది..
మతపిచ్చి బీజేపీ పార్టీ  ఎంపీ బండారు దత్తాత్రేయ లెటర్ రాసి స్కెచ్ గీశాడు..
ఆ లెటర్లను చూసి మరో మంత్రి స్మృతి ఇరానీ.. చేతిలో ఉన్న ఫవర్ ని అడ్డగోలుగా ఉపయోగించి..
'ఒత్తిడి' పెంచింది.. ఈ తతంగానికంతటికీ వీసి అప్పారావు వంత పాడాడు..
గత 14 రోజుల నుండి విద్యార్థులను గెంటేశాము..
ఆరుబయటే పండబెట్టాం..
చివరకు నలువైపుల నుండి నీ ఊపిరాడకుండా చేసి ఓ నిండు ప్రాణాన్ని  తీశాము..
అందరం కూడబలుక్కుని చంపేశాము..
నీ నిస్సహాయత గొంతు నులిమాము..
నిన్ను చేతగానివాడ్ని చేసి నీతో నిన్నే మర్డర్ చేయించాం..
కనీసం ఒక్కడంటే ఒక్కడికైనా  నీది  'హత్య' అనే దమ్ముందా..??

ఏం తెలియని రోజుల్లో.. ఏ సాయంలేని చీకటి రోజుల్లో  'దాదాసాయేబ్' తిరగబడ్డాడు..
మతాన్ని కాల్చి పాడేశాడు....
ఒంటరిగా.. 'రాజ్యా'న్ని కాళ్ల కింద వేసి తొక్కి పాడేశాడు..

రాజ్యం.. మతం కూడబలుక్కుని చేసిన మర్డర్ ను ప్రశ్నించే దమ్ము నీకుందా..?
తిరగబడగలవా..? తలబడి నిలబడగలవా..??!
చల్ నా కొడకా..
సిగ్గు, లజ్జా, ఆత్మాభిమానం ఉంటే..
రా.. వచ్చి నీ దమ్మేందో చూపించు..
నీ సోదరుడిని చంపిన మనువాదాన్ని మంటల్లో కాల్చేయి..
రాజ్యాన్ని నీ చేతుల్లోకి తెచ్చుకో..
లేదంటే..
నీ అక్కలు.. చెల్లెళ్లు.. చెరచబడుతూనే ఉంటారు..
అన్నలూ తమ్ముళ్లు చంపబడుతూనే ఉంటారు..
'తెగబడి అరాచకం రాజ్యమేలుతుంటే..
నిలబడి చూస్తావేం వందసార్లు చస్తావా..??'

సుందర్

Sunday, September 13, 2015

నన్ను నన్నుగా చూడు.. నిజమైన 'నేను' కనబడతాను..

మొన్నటి మంచిని నేనే
నిన్నటి చెడును నేనే..
నేటి ప్రశ్నను నేనే..
రేపటి సమాధానాన్ని నేనే..
పెంచిన బాధనూ.. నేనే
పంచిన ఆనందాన్ని నేనే..
మంచి, చెడు, ప్రశ్న.. సమాధానం.. బాధ, ఆనందం....
అనే నా తోకలు 'మారుతూ..' వస్తున్నయ్...
నేనిప్పటికీ 'నేను'గానే ఉన్నా...
ఎప్పటికీ 'నేను'గానే ఉంటా...
ఒక్క క్షణం...
నన్ను నన్నుగా చూడు..
నిజమైన 'నేను' కనబడతాను...
- సుందర్..

Saturday, April 25, 2015

నీ జీవితాన్ని ఐజాక్ చేసి నీ బతుకు ఇలాగే తగలడాలి అని డిసైడ్ చేస్తున్నారు.. గమనిస్తున్నావా.???


నువ్ గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుంచి నీ పుట్టుక..? పీల్చే గాలి.. తినే ఆహారం ఎలా ఉండాలి..?? నువ్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి.. నీవు ఏం తీనాలి.. ఏం చదువు చదవాలి..?? ఎక్కడ చదవాలి...? నీ చదువుకు తగ్గ జాబ్ ఏంటి..?? దాని జీతం ఏంటి..?? నీవు ఎక్కడ తిరగాలి..?? ఎక్కడ తిరగకూడదు..? నీవు ఏం మాట్లాడాలి...? ఏం మాట్లాడ కూడదు..?? నువ్ చస్తే ఎలాంటి నియమాలు పాటించాలి..? ఎక్కడ పాతిపెట్టాలి.. ఇలాంటి ప్రాథమిక విషయాల నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు ప్రతి ఒక్కటి 'చట్టం'తో ముడిపడి ఉంటాయి. చట్టానికి లోబడి నువ్ నడుచుకోవాలి. పొరపాటున తెలిసో తెలియకో నువ్ ఆ చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులు, కోర్టులు నీ తాట తీస్తాయి. నువ్ ఎంత ఎగిరినా.. ఎంత దూకినా.. చట్టానికి లోబడి చేయాలి..చివరకు నీకు బతుకు పై విరక్తి పుట్టి నా చావు నేను చస్తానని సూసైడ్ చేసుకుంటానన్నా కుదరనే కుదరదు.. నీ ప్రాణం కూడా చట్టానికి లోబడే పోవాలని నీకు తెలుసా...??
నువ్ ఎంత గొప్పవాడివైనా...? ఎంత గొప్ప చదువులు చదివినా..?? ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా...? చచ్చినట్టు నువ్ చట్టానికి లోబడి బతకాలి...
"ఇంతకీ ఏంటీ 'చట్టం' ఈ చట్టాన్ని ఎవరు తయారు చేస్తున్నారు..??
రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి 'సంపాదించడం' కోసమే రాజకీయం అనే నిర్వచనాన్నిచ్చి... విచ్చలిడిగా ఆస్తులు కూడగట్టుకునేందుకే రాజకీయం అన్నట్లు ప్రవర్థిస్తున్న ఈ రాజకీయ నాయకులకు నీ జీవితాన్ని ఎలా ఉండాలో డిసైడ్ చేసే అర్హత ఉందా..??"
హంతకులు, గుండాలు రక్షణ చట్టాలు చేయడంలో పాలు పంచుకుంటుంటే... రేపిస్టులు మహిళా చట్టాల గురించి లెక్చర్లిస్తుంటే... లంచగొండులు.. కబ్జాకోరులు అవినీతి నిరోదక చట్టాల గురించి చట్ట సభల్లో మాట్లాడుతుంటే... సమాజం పట్ల కొంచెం స్పృహ ఉండి... సమాజం గురించి ఆలోచించే నీవు ఎక్కడున్నావ్..? నాలుగు గోడల మధ్య.. డబ్బా కంప్యూటర్ ముందా..? ప్రశ్నించకుండా ఇంకెన్నాళ్ళని బతుకుతావ్.???
ఎంతమంది చట్టం తయారు చేస్తున్న వారికి 'చట్టాలపై' కనీస అవగాహన ఉంది..??
ఒక బస్ డ్రైవర్ కు కనీస చదువుండాలి..? ఒక చిన్న హోంగార్డు జాబ్ కు నేర చరిత్ర ఉంటే అనర్హుడు..! ఎంసెట్ ఎక్జాం కు బండెడు పుస్తకాలు చదివి ఎంట్రెన్స్ రాసి పాస్ అయి అర్హత సాధించాలి.. ఒక జిల్లాను పరిపాలించే కలెక్టర్ కు ప్రిలిమ్స్, మెయిన్స్.. ఇంటర్వ్యూలని వంద ఎదుర్కుని లక్షల మందిని దాటుకుని రావాలి...
దేశాన్ని నడిపే వాడికి ఏ అర్హత ఉండాలి..?? ఏ అర్హత ఉందని నీ నెత్తిలో ఎక్కి పరిపాలించే అధికారం వాడికిస్తున్నావ్..?? ఎవరు పాలించాలి ?? ఎవరు రాజ్యమేలుతున్నారు..???
రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి.., చట్టాలను, రాజనీతి శాస్త్రాన్ని, అర్థికశాస్త్రాన్ని, అవపోసన పట్టి ఐఏఎస్ లు , ఐపీఎస్ లు అవుతున్న వాళ్లు కూడా ఏడో తరగతి సరిగ్గా చదవని రాజకీయ నాయకులు చేసిన చట్టాలకు కట్టుబడి పని చేయాల్సి వస్తోంది...!
నాకెందుకులే నేను భాగున్నా.. నాక్ మంచి జాబ్ ఉంది.. ఐదంకెల జీతముంది, అనుకుంటున్న మేథావులారా..?? స్వార్థపరులు, అవినీతి పరులు, కుల పిచ్చి, మత రొచ్చుగాళ్లు, లంచగొండులు, నీ జీవితాన్ని ఐజాక్ చేసి నీ బతుకు ఇలాగే తగలడాలి అని డిసైడ్ చేస్తున్నారు.. గమనిస్తున్నావా.???



సుందర్

Thursday, March 12, 2015

అనుక్షణం నన్ను నేను వెతుక్కునేలా.. మళ్లీ.. మళ్లీ... గుచ్చుకుంటూ.. హాయినిస్తూ.. గుర్తొస్తున్నాయ్...

||నాజ్ఞాపకాలే..||

అన్నీ నేను పారేసుకున్నయే...
కొన్ని గుచ్చుకుంటున్నాయ్..
మరికొన్ని హత్తుకుంటున్నాయ్..
కొన్ని తిట్టుకుంటున్నాయ్...
ఇంకొన్ని మెచ్చుకుంటున్నాయ్...

కొన్ని..

చెట్టునుండి రాలిన ఎండుటాకుల్లా..
నాతో సంబందం లేనట్టూ...
రాలిపోయాం కదా.. ఇంకేంటన్నట్టు...
పిల్లగాలికి.. తేలియాడుతూ...
సుడిగాలొస్తే మాత్రం జాడే లేకుండా..
మళ్లీ దొరకకుండా కొట్టుకుపోతున్నాయ్..

ఇంకొన్ని...

కళ్ల ముందే ఆకాశంలో కదలాడుతూ..
అల్లంత దూరాన చుక్కల మధ్య మినుకుమినుకుమంటూ..
అందనంత దూరం విసిరిపడేసావ్ రోయ్..
అందుకోవాలని ఇప్పుడు ప్రయత్నిస్తున్నావా..
మూసుకుని భూమ్మీద నడువ్ అంటూ... 
గడ్డి పెడుతున్నాయ్..

మరికొన్ని...

వీడే కదా మనల్ని విసిరేసిందీ..
హ..హ్హా. వీడూ.. వీడి యెదవ బిల్డప్పూ...
ఇప్పుడు చూడు ఎంతలా వెతుక్కుంటున్నాడో...
ఎదురొచ్చినా గుర్తుపట్టనంతలా...
అనుభవించనీ కొడుకు.. అంటూ..
ఇకిలిస్తున్నాయ్..

ఇవేమో..

వాన చినుకులై చెంతచేరి..
నన్ను తడిపేస్తూ... తడిమేస్తూ..
నా జుత్తును మెత్తగా హత్తుకుని...
నుదుటిపై నుంచి జారి కళ్లను ముద్దాడుతూ..
మెల్లిగా చెంపలపైకి చేరి..
కళ్లనుంచొచ్చిన నీటిసైతం తమలో కలుపుకుని..
కనిపించకుండా కవర్ చేశాయ్..
మేం చిటపటా.. చిటాపటా.. దరువేస్తాం..
నువ్ డ్యాన్స్ చెయ్ రా చిన్నోడా... అంటూ...
ఉత్సాహాన్నిస్తున్నాయ్..

ఇవే నా జ్ఞాపకాలంటే..

అర క్షణంలో పుట్టి మరు క్షణానికి గతమైపోతూ..
నన్ను.. మంచోన్ని చేస్తూ..
చెడ్డోన్ని చేస్తూ.. డ్యాన్సులాడుతున్నాయ్..
ఎంతైనా నేను పారేసుకున్నవేగా..
అనుక్షణం నన్ను నేను వెతుక్కునేలా..
మళ్లీ.. మళ్లీ... గుచ్చుకుంటూ.. హాయినిస్తూ.. గుర్తొస్తున్నాయ్...

- సుందర్

Monday, December 1, 2014

ఇదేదో పల్లెటూరిలోని వాతావరణం కాదు.. పక్షుల కిలకిలారావాలెరుగని కాంక్రీటారణ్యంలో ఉన్న.. ఓ ఆహ్లాదమైన ప్రదేశం...!!


మబ్బు దుప్పటిని తీసేసి పైకిలేచి కళ్లు తెరిచాడో లేదో..
ఆ భానుడి నులివెచ్చని చూపుల కాంతులు తాకిన మొగ్గలు..
సిగ్గుతో విచ్చుకున్నాయనుకుంటా..
అక్కడ రంగురంగుల పువ్వులు.. పచ్చని చెట్లు..
పిల్లగాలి తాకగానే తుల్లిపడుతూ కదలాడుతున్నాయ్...
ఒక పువ్వును మించి మకొటి.. ఒక తీగను దాటి ఇంకోటీ..
అరచేతి అంత పెద్దగా విస్తరించి.. నన్నే పిలుస్తున్న రోజాలు..
మేమేం తక్కువ అంటూ.. ఫోజు కొడుతున్న చిన్న చిన్న గడ్డిపూలు..
వేటికవే సాటి..
ఇదేదో పల్లెటూరిలోని వాతావరణం కాదు..
పక్షుల కిలకిలారావాలెరుగని కాంక్రీటారణ్యంలో ఉన్న..
ఓ ఆహ్లాదమైన ప్రదేశం...
అదే 10టీవీ బిల్డింగ్ లోని నాలుగవ అంతస్తులో ఉన్న కను విందైన నర్సరీ...
(ఉదయం రెండు నిమిషాలు అక్కడ నిల్చుంటే.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా హాం ఫట్ అంటూ ఎగిరిపోవాల్సిందే.. ప్రతీ రోజు ఉదయం 5 నిమిషాలు వీటిని పలకరించకుంటే.. నా రోజు గడవట్లేదోచ్..)












సుందర్

Sunday, October 26, 2014

విద్యార్థుల నుండి 'పిండేసుకోవడమేనా' 'కోచింగ్' అంటే..!!

ఆరు వేల మంది విద్యార్థులు క్యూలో నిలబడితే.. ఒక ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ సీటు కోసం లాఠీచార్జీ కూడా జరిగితే.. ఆ ఇన్సిస్టిట్యూట్ ఎంత గొప్ప డిమాండ్ ఉన్నట్లు ఎవ్వరైనా ఒప్పుకుంటారు. ఇంతమంది విద్యార్థుల అరుపులు, సందడితో ఎంత పెద్ద ప్రాంతమైనా మారు మోగాల్సిందే.. అదీ నిత్యం విద్యార్థులతో రద్ధీగా ఉండే హైదరాబాద్ లోనైతే ఒక ఇనిస్టిట్యూట్ కు ఇంతకంటే ఇంకా పెద్ద పబ్లిసిటీ... అడ్వర్టైజ్ మెంట్ ఏం కావాలి.??
ఇక అది రాష్ట్రంలోనే పేరుమోసిన ఓ ఇనిస్టిట్యూట్. ఆ సంస్థకు మాం...చి గుడ్ విల్ ఉంది. ఇంకేముందీ గుడ్ విల్ కు మార్కెటింగ్ స్ట్రాటజీ జోడించారు. లేని డిమాండ్ ను 'సృష్టించారు.' స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టి మరీ సందర్భాన్ని భా...గా 'క్యాష్' చేసుకుంది. ఆ ఇన్సిట్యూట్ సీటే వర్నమెంట్ జాబ్  అన్నంత హైప్ క్రియేట్ చేశారు. అద్భుత ఫలితాన్ని పొందారు. తీరా విద్యార్థులకు సరైన సమయంలో మాత్రం కోచింగ్ ప్రారంభించనే లేదు. 

వీడు ఇంత సాగదీస్తున్నాడు.. ఏం జరిగిందబ్బా అనుకుంటున్నారా...? ఇక చదవండి..

హైదరాబాద్ లో అశోక్ నగర్...
                    ఇనిస్టిట్యూట్ లకు ఫేమస్. ఈ ప్రాంతంలో కుప్పలుతెప్పలుగా ఇనిస్టిట్యూట్లు కేంద్రీకృతమై ఉంటాయి. ఇరు రాష్ట్రాలనుండి ఎక్కడెక్కడి నుండో వచ్చి.. విద్యార్థులు రూంలు, హాస్టళ్లలో ఉంటూ ప్రభుత్వ కొలువులు సాధించేందకు ఇక్కడే అష్టకష్టాలు పడుతుంటారు. ఈ మధ్య కొత్త రాష్ట్రం ఏర్పడటంతో గవర్నమెంటు ఉద్యోగాలు పడతాయన్న ఆశతో చాలా మంది మారుమూల గ్రామాలనుంచి విద్యార్థులు ఇనిస్టిట్యూట్ కోసం ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఈ డిమాండ్ ను ముందే పసిగట్టింది 'టాప్' ఇన్సిట్యూట్ లలో ఒకటైన ఆర్సీరెడ్డి. ఈ సందర్భాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని బ్యాచ్ లు స్టార్ట్ చేస్తామని ఒక రెండు మూడు నెలల పాటు విద్యార్థుల పేర్లు రిజిస్టర్ చేసుకుంది. కాగా చాలా మంది పేర్లు రిజిస్టర్ చేసుకున్నా.. బ్యాచ్ స్టార్ట్ చేయకపోవడంతో ఓ సారి ఓయూ విద్యార్థులు ఇక్కడ ధర్నా చేసి వెళ్లారు కూడా... తీరా ఆరువేల పైచిలుకు మంది విద్యార్థులు తాము కోచింగ్ తీసుకుంటామని తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు.
''ఒక రోజే అడ్మిషన్స్ త్వరపడండీ''.. ఆరువేల మందికీ 'ఒకే మెసేజీ'.. 
''ఈ ఒక్క రోజులోనే వచ్చి జాయిన్ కావాలి... ఈ రోజు వచ్చిన వారికే సీటు ఉంటుంది. ఒక్క బ్యాచ్చే స్టార్ట్ చేస్తున్నాము. ముందు వచ్చి ఫీజు చెల్లించిన వారికే మొదటి ప్రాధాన్యం..'' అని కరెక్టుగా దసరాకు నాలుగైదు రోజుల ముందు అందరికీ ఆర్సీ రెడ్డి నుండి ఒకే మెసేజీ వెళ్లింది. పాపం... ఈ సారి ఎలాగైనా కోచింగ్ తీసుకుని జాబ్ కొట్టాలని ఎదురు చూస్తున్న ఆరువేల మందీ వచ్చేసారు. ఈ ఇంకా తమ పేరు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా చాలా మంది వచ్చారు. ఉదయం ఐదు గంటల నుండి క్యూ కట్టారు. ఆర్సీరెడ్డి ఇన్సిట్యూట్ నుండి అశోక్ నగర్ రోడ్ వరకూ చాంతాడంత క్యూ ఏర్పడింది. ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, బంధువులతో అశోక్ నగర్ మొత్తం సందడి సందడిగా మారింది.
పోలీసులతో హంగామా...
ఇంత మంది విద్యార్థులు క్యూలో నిల్చోవడంతో.. రిజిస్ట్రేషన్ లో చేయడంలో కొంచెం ఆలస్యమైనా.. లేదా ఎవరైనా క్యూలో తమకంటే ముందు వచ్చి మధ్యలో నిల్చున్నా... థియేటర్లలో టిక్కెట్ల వద్ద అరిచినట్లు విద్యార్థులు పెద్ద ఎత్తున అరుస్తున్నారు. గొడవచేస్తున్నారు. ఎంతైనా ఉడుకు రక్తం కదా.. దీంతో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే 20 మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఇక అక్కడ హైడ్రామా స్టార్ట్ అయ్యింది. అదేదో ముఖ్యమంత్రి ఆఫీసు అయినట్లు ఒక్కరిని కూడా కనీసం ఆఫీసు ముందు నిల్చోనివ్వ లేదు. అంతెందుకు ఆ గల్లీలోకి వెళ్లనివ్వలేదు. క్యూలో ఉన్న విద్యార్థులంతా అష్టకష్టాలు పడి ఐదారుగంటలు నిల్చుని ఆపసోపాలు పడ్డారు. కాగా మొత్తం ఫీజు ఒకేసారి 16,950 రూ.లు చెల్లించి.. ఒక రిసిప్ట్ తీసుకుని బయటకి వస్తూ.. తామేదో సాధించామని ఫీలవుతున్నారు. ఉదయం ఆరుగంటలనుండి మొదలైన రిజిస్ట్రేషన్.. రాత్రి ఏడెనిమిది గంటల వరకు కొనసాగింది. మూడు బ్యాచ్ లకు 4,500 నుంచి 5,000 మందిని జాయిన్ చేసుకుని, వారినుంచి నుంచి ఫీజు  వసూలు చేశారు. మూడు బ్యాచ్ లు కాబట్టి.. ఒక్కో బ్యాచ్ లో సుమారు 1500 వందలకు  పైగా మందితో నడుస్తుందన్నమాట.
సృష్టించ బడిన డిమాండ్..
అయితే ఇదంతా 'సృష్టించబడిన డిమాండ్' అని ఎవ్వరూ గ్రహించనేలేదు. సాధారణంగా ఎప్పటి వప్పుడు లేదా ఒక వారం రెండు వారాలు జాయినింగ్ ప్రాసస్ ఉంటే..  కొంత మంది ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు పీజు కొంత తక్కువ చేయమని కోరతారు.  కానీ ఈ కల్పిత డిమాండ్ తో దేవుడా.. ఆ ఆఫీసులోకి వెళ్లడమే గొప్పరా బాబు అనుకుంటూ.. యాజమాన్యం  చెప్పినంత ఫీజు చేతిలో పెట్టి వచ్చారు.
ఇప్పటికీ ఒక్క బ్యాచ్చే ప్రారంభం...
అయితే విశేషమేమిటంటే సెప్టెంబర్ 29న జాయినింగ్ ప్రాసెస్ జరిగింది. మొదటి బ్యాచ్ అక్టోబర్ 23న ఒక ప్రారంభమైంది. మరో బ్యాచ్ అక్టోబర్ నెల 27న ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. కాగా మూడో బ్యాచ్ నవంబర్ మొదటి వారంలో మొదలవుతుందంటున్నారు. ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన ఆర్సీ రెడ్డి యాజమాన్యం బ్యాచ్ లు ప్రారంభించడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. దీంతో త్వరగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఈ సారి ఎలాగైనా జాబ్ కొట్టాలని  ఫీజులు ముందే చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. మార్కెటింగ్ స్ట్రాటజీ భాగానే ప్లాన్ చేశారు. దాంతో పాటు విద్యార్థులకు సరైన సదుపాయాల్తో.. సరైన సమయంలో శిక్షణ అందిస్తే బాగుండేది.. ఏం చేస్తాం.. కార్పో'రేట్' లకు విద్యార్థుల కష్టాలేం పడతాయి.!!
కోచింగ్ ఎలా ఉంటుంది..
వారి ఒక్క ఈ మూడు బ్యాచ్ లు ప్రారంభించినందుకు ఆదాయం సుమారు ఎనిమిది కోట్ల యాబై లక్షలు(17000X5000 = 8,50,00,000) వీరు  ఒక ఫంక్షన్ హాల్.. లేదా ఒక కాలేజీలో పేద్ద మీటింగ్ హాల్ అద్దెకు తీసుకుంటారు. ఈ 1500 వందల మందిని గుంపుగా కూర్చోబెట్టి మైక్ లో పాఠం చెబుతారు. చివరిలో ఉన్న వారికి బోర్డు కనిపించదు.  పాఠం చెప్పే మనిషి  వాయిస్ వినిపించడం తప్ప.. కనిపిస్తే గొప్ప విషయం. ఇంత మంది విద్యార్థుల్లో ఎవరు ఏమి నేర్చుకుంటారు..?? డౌట్స్ వస్తే ఇంత మంది తమ సందేహాలను ఎలా తీర్చు కుంటారు..??? డబ్బులు తప్ప వీరికి నాణ్యత పట్టదా..??? ఒక్కొక్కరి వద్ద ఇన్నిన్ని ఫీజులు వసూలు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పెద్ద ఇనిస్టిట్యూట్స్ అని చెప్పుకునే ఇలాంటి సంస్థలకు నియంత్రణ ఉండదా..?? నిరుద్యోగ యువతను నిలువు దోపిడీ చేస్తున్న ఇలాంటి సంస్థకు అడ్డుకట్ట పడదా.?? అమాయక విద్యార్థులు బలి కావాల్సిందేనా..??


సుందర్

Monday, October 6, 2014

ఆడవాళ్లపై దాడి చేయడం తప్పు... కానీ ఒక అమ్మాయి ముక్కూ చెవులూ.. కోయడం మాత్రం 'ధర్మం'...!

మంచి చెడు అని రెండు విరుద్ధ భావాలు ఉంటాయంట..

కానీ కొన్ని సార్లు చెడు అని చెప్పుకున్నదే..
ధర్మం అనే పేరుతో ఈ సమాజంలో చలామణి అవుతోంది.. ఏమిటో విచిత్రం..!

ఆడవాళ్లపై దాడి చేయడం తప్పు...
ఒక అమ్మాయి ముక్కూ చెవులు కోయడం మాత్రం 'ధర్మం'..

అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను అనుమానించడం తప్పు..
లోకం పేరు చెప్పి భార్యను మంటల్లోకి వెళ్లమనడం ధర్మం..

జీవితాంతాంతం కలిసి ఉంటానని పెళ్లి చేసుకున్న భార్యను ఒంటరిగా వదిలేయడం తప్పు..
అదే భార్యని అందునా.. నిండు గర్భిణిని కారడవిలో వదిలేయడం 'ధర్మం'..

విలన్ అనే పేరుతో ఒకరిని హత్య చేస్తే హంతకుడు..
హీరో అనే పేరుతో చంపితే దుష్ట సంహారం..

దేవుడా.. ఎవడికి అనుకూలంగా ఉన్నది వాడు.. 'ధర్మం'గా చెప్పుకోవడం.. సమర్థించుకోవడం ఫ్యాషన్ అయ్యింది...!

సుందర్

Saturday, July 12, 2014

'బేసిక్ గా నాకు కలలు గుర్తుండవు.. కానీ ఈ కల ఏంటీ..? నాకు 70ఎంఎం లో చూసిన మూవీ అంత క్లియర్ గా డైలాగ్స్ తో సహా గుర్తుందీ....??!!!

అది మా ఊరి పడమర వైపు ఉన్న పొలిమేర. ఊరి చివరన స్కూల్ ఉంటుంది. స్కూల్ దాటాక ఇంతకు ముందు ఎప్పుడో పంటలు వేసి, ప్రస్తుతం ఖాళీగా వేసి వదిలేసిన మెట్టభూమి ఉంటుంది. అయితే మా ఊరికి అర కిలోమీటరు దూరంలో పెద్ద బండ ఉంటుంది. సుమారు ఒక అర కిలోమీటరు వరకు భూమి క్రింద నుంచి విస్తరించి ఉంటుంది. ఆ ప్రాంతంలో చాలా మంది ఎన్నో బోర్లు వేశారు. కానీ ఒక్క బోర్లో కూడా నీరు పడిన దాఖలాలు లేవు. స్కూల్ ప్రక్కనే ఒక బోరు బావి ఉంది. అందులో నీరు పడకపోవడంతో అలా వదిలేశారు.సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర మధ్య అనుకుంటా మసక మబ్బు ఉంది. సడెన్ గా ఆ ప్రాంతానికి ఎలా వెళ్లానో తెలీదు. స్కూల్ గోడపైనుండి అవతలికి దూకాను. ఆశ్చర్యంగా అక్కడ ఒక చెరువు కనిపిస్తోంది. నేను చెరువు గట్టుపై ఉన్నాను. నాకు ఐదు అడుగుల దూరంలో... చెరువులో ఏపుగా మొలిసిన పెద్ద గడ్డి దుంపలు ఉన్నాయి. ఆ గడ్డి దుంపల పక్కన మనుషులు కనిపిస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్లి చూశాను. వారు మనుషులే కానీ ఎందుకో వారిలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏంటని గమనిస్తే నేను అప్పుడప్పుడూ చూసిన ఇంగ్లీష్ సినిమాల్లో డ్రాకులా క్యారెక్టర్లకు ఉండేటువంటి కోరల పళ్లు వారికున్నాయి. సడెన్ గా ఎవరో ఇద్దరు వచ్చిన నన్ను గట్టిగా పట్టుకున్నారు. శరీరారానికి నొప్పిగా అనిపిస్తే విదుల్చుకుంటున్నాను. వారి గోర్లు చాలా పొడవుగా మొనదేలి ఉన్నాయి.నన్ను వాళ్లు చెరువు లోపలికి లాక్కెల్లారు. చెరువు లోపల విచిత్రంగా పెద్ద కార్పోరేట్ ఆస్పిటల్ మాదిరి ఒక భవనం ఉంది. అందులో ఒక బెడ్ పై కూర్చోబెట్టారు. గోళ్లతో రక్కుతున్నారు. అప్పుడు మరో డ్రాకులా వచ్చి స్టెతస్కోపు లాంటి ఒక పరికరం తో ఏవో టెస్టులు చేసింది. 'ఇతనికి బ్లడ్ సరిగ్గాలేదు' వదిలేయండి అని చెప్పింది. నాకు ఆశ్చర్యం, ఆనందం, భయం మూడూ ఒకే సారి వచ్చాయి. కానీ ఇంత పెద్ద భవనుండి ఎటు వెళ్లాలి..? ఎలా వెళ్లాలి..?? అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నాకు హెల్ప్ చేసిన డ్రాకులా, ఒక విజిల్ నా చేతికి ఇచ్చింది. 'ఈ విజిల్ ఊదుతూ వెళ్లూ.. ఒక్కో డోర్ తెరుచుకుంటుంది. అని చెప్పింది. నేను విజిల్ వేసినా కొద్దీ ఒక్కో డోర్ తెరుచుకుంటుంది. డోర్ కు అడ్డంగా వేసిన తెల్లని కర్టెన్ ను దాటుకుంటూ.. ఒక ఐదారు డోర్లు దాటాను. అంతా చీకటి కమ్ముకుంది. ఒక్క సారిగా వెలుగులోకి వచ్చే సరికి విచిత్రంగా మా స్కూల్ ప్రక్క గళ్లీ రోడ్ లో నడుస్తున్నాను.అప్పుడే స్కూల్ ఆవరణలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఏదో పాటను చిత్రీకరిస్తున్నారు. అక్కడ అందర్తో పాటు నిల్చుని నేనూ స్టెప్ వేశాను. డ్యాన్స్ మాస్టారు వచ్చి నీ స్టెప్ బాలేదు పక్కకు జరుగు అన్నాడు. నేను ఫీల్ అయ్యి ప్రక్కకు జరిగి స్కూల్ బయట అడుగు పెట్టాను.మా ఊర్లో బోనాల పండగ జరుగుతోంది. పోతు రాజులు చర్నకోలలు చరుస్తూ వస్తున్నారు. నేను ఎగిరి ప్రక్క ఇంటి గోడపైన కూర్చోబోయాను. పోతురాజు వచ్చి ఒక్క సారి చర్నకోలతో కొట్టాడు. కానీ ఏమి దెబ్బ తాకలేదు. మరో వ్యక్తి కొట్టడానికి వచ్చాడు. పక్క గల్లీలోకి వెళ్లాను. చిత్రంగా ఇబ్రహిం పట్నం చెరువు కట్ట పైన అమ్మ, మామలతో కలిసి నడిచి వెళ్తున్నాను. కొద్ది దూరం నడవగానే మళ్లీ స్కూల్ పక్కన గల్లీ వచ్చింది. ఇదేం విచిత్రమో అర్థం కాలేదు.అప్పటికే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను వచ్చాడు. గోడపై కూర్చున్నాము. 'నువ్వు విజిల్ తీసుకొచ్చావంట కదా.. స్కూల్ ప్రక్కన బోరు బావిలోంచి ఎవరో అమ్మాయి అడుగుతోంది. అక్కడికి ఎవ్వరు వెళ్లినా సుందర్ అని మాట్లాడుతోంది. ఆ విజిల్ లేకుంటే ఆ అమ్మాయిని అక్కడ నుండి వెళ్లగొడతారంటా..' అని చెప్పాడు. కానీ విజిల్ ఎక్కడ పడేశానో నాకు గుర్తు లేదు. అటువైపు వెళ్లాలంటే భయం వేసింది.స్కూల్ ప్రక్క సందులోంచి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆఫీసు నుండి కాల్ వచ్చింది. షిఫ్టులు అడ్జెస్ట్ అవ్వడం లేదు. ఏం చేయాలి అంటూ.. వారికి ఏదో చెప్పి పెట్టేశాను.స్కూల్ మెయిన్ రోడ్ నుండి మా ఇంటి వైపు బయలుదేరాను. అప్పుడే వెనకనుండి ఏదో లాగుతోంది. ఏంటి అని చూస్తే ఏదో ఆకర్షణ బలం, గాలి బలంగా లాగుతోంది. నా ప్రక్కన వచ్చే అతన్ని అడిగాను. అన్నా ఏంటో అటువైపు లాక్కుపోతోంది. అంటే అతను చేయి అందించాడు. నేను మెళ్లిగా ఇంటివైపు నడుస్తున్నాను. 'ఏయ్ ఏంటి ఎక్ష్ట్రాలుచేస్తున్నావ్.. వెంట పడుతున్నా అని పొగరా' అనే మాటలు అమ్మాయి గొంతు నుంచి వినిపిస్తున్నాయి. పక్కకు తిరిగి చూస్తే ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నా. చిత్రంగా ఆ డ్రాకుల భవనం నుండి ఆ రోజు నాకు హెల్ప్ చేసిన డ్రాకులా. కానీ డ్రాకులా లేదు మామూలు అమ్మాయిలా ఉంది. చూడటానికి మిస్ యూనివర్స్ లాగా ఉంటుందనుకున్నా.. అలా లేదు కానీ అందంగా ఉంది. చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది.'నువ్వు డ్రాకులాగా మారతావా..? నేను మనిషిగా మారనా అంటోంది. నేనేమి మాట్లాడలేదు. నీ గురించి నన్ను మా వాళ్లు మా ప్రపంచం నుండి వెళ్లగొట్టారు అన్నది. నాకు జాలేసింది. మరి నేను డ్రాకులాగా మారనా అన్నాను. తర్వాత మళ్లీ నేనే.. మాట్లాడుతూ నువ్వే మనిషిగా మారు అని ఆ అమ్మాయిని అడిగాను. ముందుకు నడుస్తుంటే ఎవరో రాజకీయ నాయకుడు.. కనిపించి జిల్లాలో జరుగుతున్న మీటింగ్ లో ఎవరో ఏదో మాట్లాడాడు అని చెప్పాడు. ఆ అమ్మాయి కళ్లు మూసి తెరిచి... అక్కడ ఆ రాజకీయ నాయకుడు ఏమి మాట్లాడాడో కరెక్టుగా చెప్పింది. ఇంకా ఏదో మాట్లాడుతున్నాము. వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. విజువల్ కూడా మాయమౌతోంది. అంతా సెట్ అయ్యే సరికి ఆ అమ్మాయి నా పక్కన లేదు. బోరు బావి దగ్గరకు వెళ్లాను. అందులోంచి ఆ అమ్మాయి వాయిస్ వినిపిస్తోంది. దాని చుట్టూ కొంత మంది నిల్చున్నారు. నేను అనుకుని వారితో మాట్లాడుతోంది. 'ఓయ్ దిమాక్ తిరుగుతుందా..? నా గురించి స్కూల్ దాటి వచ్చి మాట్లాడినవ్.. ఇప్పుడు బోరు బటయకు వచ్చి చూసి మాట్లాడొచ్చు కదా..? నేను అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నావు' అని కోపంగా అన్నాను.అప్పుడే మెలుకువ వచ్చింది. మొబైల్ లో టైం చూస్తే ఉదయం 5.05 నిమిషాలు అవుతోంది. ఈరోజు డెస్క్ లో మార్నింగ్ డ్యూటీ 6 గం.లకు. మళ్లీ పడుకున్నా.. ఆ కల కంటిన్యూ అవుతుందేమో అని చాలా సేపు ట్రై చేశాను. కానీ లాభం లేదు...ప్చ్..
'బేసిక్ గా నాకు కలలు గుర్తుండవు.. కానీ ఈ కల ఎందుకో 70ఎంఎం లో చూసినంత క్లియర్ గా డైలాగ్స్ తో సహా గుర్తున్నాయి...'

సుందర్

Wednesday, February 12, 2014

ప్రపంచ క్రికెట్ కు పెద్దన్నగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న బిసిసిఐకి కునుకులేకుండా చేస్తోంది..? భారత్ కు రెండు ప్రపంచ కప్ లు అందించిన కెప్టెన్ ను వణికిస్తోందో భూతం... ఈ పెను భూతం ఐపిఎల్ ను మింగేయనుందా..?

             భారత క్రికెట్ లో ఫిక్సింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ ఆరవ సీజన్ లో ఫిక్సింగ్ కు పాల్పడి, జీవితకాల నిషేధానికి గురైన శ్రీశాంత్, తదితరులను మరవకముందే.. అదే ఫిక్సింగ్ లో మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ పై విచారణ పూర్తిచేసిన ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో టీమిండియా కెప్టెన్ ధోని, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ రైనా పేర్లు ఉన్నాయన్న వార్తలు అభిమానులను తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. ఐపీఎల్లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధోనీ చెన్నై జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు చెందినది కావడం, ఆయన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ ను ముద్గల్ కమిటీ దాదాపు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. ధోనీ, రైనా పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.