అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Thursday, November 4, 2010

అభాగ్య జీవులు


పొద్దుపొద్దున మూడు, మూడున్నర అవుతుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌ రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు నేను ప్రజాశక్తి ఆఫీస్‌లో డ్యూటీ ముగించుకుని రూంకి వెళ్తున్నాను. కొద్దిగా ముందుకెళ్లగానే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు నిద్రమబ్బు ముఖాలతో, చిరిగినబట్టలు దరించి... చెరిగిన చింపిరి జుట్టుతో భుజాన సంచులు వేసుకుని రోడ్డుపై తొందర తొందర పరిగెడుతున్నారు. ఇంత చలిలో బతుకు పోరాటానికి బయలు దేరుతున్న వాళ్లనే గమనిస్తున్నా...
ఇంతలో ఒక చెత్తకుప్ప వద్ద ఆదరా బాదరాగా ప్లాస్టిక్‌కవర్‌లు, కాగితాలను ఏరుకుంటున్నారు. ఎందుకు ఇంత ఎముకలు కొరికే చలిలో వాళ్లు అలా పోటీ పడిమరీ ఏరుకుంటున్నారు... అని నా పక్క వ్యక్తిని అడిగితే మరికొద్దిసేపయితే చెత్త లారీ వచ్చి ఆ చెత్తనంతా తీసుకుపోతుందని అందుకే వారు అలా.... అని అతను చెప్పగానే ఒక్కసారిగా నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంత చిన్నవయసులో వాళ్లకు చెత్త ఏరుకునే కర్మ ఎందుకు వచ్చింది.. చదువుల్లో.. ఆటా పాటల్లో పోటీ పడాల్సిన ఈ చిన్నారులు చెత్త ఏరుకునేందుకు పోటీ పడుతుంటే నాలో ఒక్కసారిగా బాధతో కూడిన ఆవేశం తన్నుకొచ్చింది. పేదలను ఉద్దరిస్తున్నామని ఎన్నో స్టేజీలపై డబ్బాలు కొట్టుకునే ఈ ప్రభుత్వానికి....! చిన్న పిల్లలకోసం మేము ఇన్ని చట్టాలు చేశాం అన్ని నిధులిచ్చాం... అని బడాయీలకు పోయే ఈ పాలకులకు.... ఉపన్యాసంపూర్తికాగానే.. చాయ్ అందించేది ఓ బాల కార్మికుడున్న విషయం తెలియదు.
 

పాలు తాగే పసి ప్రాయంలో ఇంకా జీవితం అంటే ఏమిటో తెలియని వయసులో గుండెల్లో బాధను నింపుకుని భుజాన బతుకు భారాన్ని మోసుకుంటూ.. హుషారుగా తిరుగుతుంటే.. ఆ హుషారు... ముఖానికి వేసుకున్న ముసుగే అనీ.. ప్రతి పూటా... బుక్కెడు బువ్వ లేక అలమటించే ఆ ఆకలి పేగులు చెబుతాయి వాడి అవస్తలేమిటో. చదువుకోవల్సిన వయసులో... చెత్తలేరుకుంటూ సాగించే జీవనయాణంలో గమ్యం ఏమిటో తెలియని ఈ అభాగ్యజీవులా... రేపటి భావి భారత పౌరులు.... అన్న నా ఆలోచనలు రూంకెళ్లి రెప్పవాల్చే వరకూ.. నా మదిలో  కదలాడుతూనేఉన్నాయి...

సుందర్

1 comment: