అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, January 31, 2011

విశ్వ వినువీదులలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన వేళ (1983 ప్రపంచ కప్‌లో ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించిన మధుర క్షణాలు మరోసారి నెమరు వేసుకుంటూ...)

1983 అంటే భారతీయులకు, ప్రపంచానికీ వెంటనే స్పురించేది కపిల్‌ ఆద్వర్యంలోని భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ సాధించి భారత ప్రతిష్టను ప్రపంచం దశదిశలా వ్యాపింపజేసిన అపూర్వ సంఘటన. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లిన కపిల్‌ సేన విశ్వ విజేతగా నిలిచి ఔరా అనిపిచింపించది. ఆ మధుర క్షణాలు, టీం ఇండియా ఒక్కో మ్యాచ్‌ ఎలా గెలిచారు...? అరివిర భయంకర బౌలర్లు, ఉద్దండులైన బ్యాట్మెన్లు ఉన్న విండీస్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలను ఎలా నిలువరించారో అనే విషయం తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. ఆ మధుర క్షణాలు ఒక్కటిగా... ఒక్కో మ్యాచ్‌లో భారత్‌ తన జైత్ర యాత్రను ఎలా కొనసాగించిందో.. పరిశీలిద్దాం.....
1983లో ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ప్రపంచ కప్‌ జూన్‌ 9వ తారీకు నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నమెంటులో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్‌ ఎ లో ఇంగ్లాండ్‌, పాకిస్తాన్‌, న్యూజీలాండ్‌, శ్రీలంక జట్లున్నాయి. గ్రూప్‌ బిలో వెస్టిండీస్‌, భారత్‌, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు తలపడ్డాయి.మొదటి మ్యాచ్‌:
భారత్‌ మొదటి మ్యాచ్‌ జూన్‌ 9న మాంచెస్టర్‌లో ఓల్డ్‌ ట్రాఫ్పర్డ్‌ మైదానంలో, అప్పటి నెంబర్‌ వన్‌ జట్టు వెస్టిడీస్‌తో తలపడింది. టాస్‌ గెలిచిన విండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 60 ఓవర్లలో 262/8 పరుగులు చేసంది. యశ్‌పాల్‌ 89, పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాటిల్‌ 36, రోజర్‌బిన్ని 27, మదన్‌లాల్‌ 21 పరుగులు చేయడంతో భారత్‌ నిర్ణీత 60 ఓవర్లలో 262/8 చేసింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన విండీస్‌ను, మదన్‌లాల్‌, రోజర్‌బిన్నీ చెరి మూడు వికెట్లు తీసుకుని కుప్పకూల్చారు. దాంతో విండీస్‌ 228 పరుగులకే మూటకట్టింది. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ యశ్‌పాల్‌ శర్మకు లభించింది.
రెండవ మ్యాచ్‌
జూన్‌ 11న కంట్రీ గ్రౌండ్‌ వెర్సెస్టెర్‌లో జింబాబ్వేతో జరిగింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ జింబాబ్వేను 37.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ చేసింది. మదన్‌ లాల్‌ బౌలింగ్‌లో రాణించి మూడు వికెట్లు తీయగా, బిన్ని రెండు, కపిల్‌, సందు, రవిశాస్త్రిలు తలో వికెట్‌ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌, సందీప్‌ పాటిల్‌ 50, అమర్‌నాథ్‌ 44, రాణించడంతో 37 ఓవర్లలో లక్ష్యాన్ని అలవోకగా చేధించారు.
బౌలింగ్‌లో రాణించిన మదన్‌లాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
మూడవ మ్యాచ్‌
ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆస్ట్రేలియతో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసిస్  బ్యాటింగ్‌ ఎంచుకుంది.  చాపెల్‌ 110, హగ్స్‌ 52, యల్లాప్‌ 66 రాణించడంతో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. లక్ష్య చేదనలో తడబడిన భారత్‌ 158 పరుగులకే ఆలౌటయ్యింది. భారత బ్యాట్మెన్లలో శ్రీకాంత్‌ 39, కపిల్‌ 40 మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియన్‌ బౌలర్‌ మెక్‌కీ ఆరు వికెట్లు తీసుకుని భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. సెంచరీ సాధించిన చాపెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
నాలుగవ మ్యాచ్‌
జూన్‌ 15న ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. వివియన్‌ రిచర్డ్స్‌ విశ్వరూపాన్ని చూపించాడు ఆరు ఫోర్లు, ఒక సిక్సరుతో 119 పరుగులు చేశాడు. హయిన్స్‌ 38, లాయిడ్‌ 41 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రోజర్‌ బిన్నీ రాణించి 3 వికెట్లు తీసుకున్నాడు. తదనంతరం బ్యాట్‌ింకి దిగిన భారత్‌ ఓపెనర్లను రాబర్ట్‌ వెంట వెంటనే పెవీలియన్‌కు పంపాడు అమర్‌నాథ్‌ 80, వెంగ్‌సర్కార్‌ 32, కపిల్‌ 36 పరుగుల చేసినప్పటికీ మిగతా వారు త్వరత్వరగా  ఔటవ్వడంతో 216 పరుగలకే కుప్పకూలింది. విండీస్‌ బౌలర్లలో హౌల్డింగ్‌ మూడు వికెట్లు, రాబర్ట్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. అద్భుత సెంచరీతో  జట్టుకు భారీ స్కోరు అందించిన వివియన్‌ రిచర్డ్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. మొదటి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓటమిపాలయిన విండీస్‌ ఈ విజయంతో ప్రతీ కారం తీర్చుకుంది.
ఐదవ మ్యాచ్‌
ఈ మ్యాచ్‌ జూన్‌ 18 నేవిల్‌ గ్రౌండ్‌లో జింబాబ్వేతో జరిగింది. టాస్‌ గెలిచిన ఇండియన్‌ కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తేనే సెమీస్‌కు అవకాశాలుంటాయి. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన బారత బ్యాట్మెన్లు ఒకరి వెంట ఒకరు క్యూ కట్టారు, టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం వల్ల పెద్ద తప్పిదం జరింగిందని భారత్‌కు కొద్ది సేపట్లోనే అర్థమయింది. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తుండటంతో జింబాబ్వే బౌలర్లు విజృంబిస్తున్నారు. భారత్‌ 17పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన భారత కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌, రోజర్‌బిన్నీ (22)తో కలిసి 60 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును పటిష్టపరిచాడు. ఈ సమయంలోనే ఒక పరుగుల తేడా బిన్ని, శర్మ వికెట్లు టపటప పడిపోయాయి. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. సహచరులంతా పెవీలియన్‌కు క్యూ కడుతున్నా కపిల్‌ వెరవకుండా భారీ షాట్స్‌ ఆడుతున్నాడు. గ్రౌండ్‌ నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో జింబాబ్వే బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మదన్‌లాల్‌ (17)తో కలిసి 62 పరుగుల బ్యాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కిర్మాణితో తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 126 పరుగుల రికార్డు బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కపిల్‌ 16 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. అప్పట్లో భారత్‌ తరుపున అదే అత్యుత్తమ స్కోరు. నిర్ణీత 60 ఓవర్లలో 266 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జింబాబ్వే బ్యాట్మెన్లలో కరన్‌73 పరుగులు చేసి జింబాబ్వేను గెలిపించినంత పని చేశాడు.చివర్లో వికెట్లు పడిపోవడంతో 235 పరుగులకు ఆలౌటయ్యింది. మదన్‌లాల్‌ మూడు, బన్ని రెండు వికెట్లు తీసుకున్నారు. భారత కెప్టెన్‌, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఇన్నింగ్స్‌ హీరో కపిల్‌ దేవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
ఆరవ మ్యాచ్‌
జూన్‌ 20న కంట్రీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వన్డేలో భారత్‌ ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న  భారత్.. బ్యాట్మెన్లు ఒక్కరూ  భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోయినా తలా పిలాకం అన్నట్లు వచ్చినవాళ్లు వచ్చినట్లు 20,30,40 పరుగులు సాధించడంతో భారత్‌ 247 పరుగులు చేసింది. ఇందులో యశ్పాల్‌ చేసిన 40 పరుగులే అత్యధికం.
తదనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మొదటి మ్యాచ్‌ సెంచరీ హీరో చాపెల్‌ను కేవలం రెండు  పరుగులకే సందు పెవీలియన్‌కు పంపాడు. భారత బౌలర్లలో మదన్‌లాల్‌, బిన్నీ చెరి నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచారు. వీరి విజృంభనతో ఆస్ట్రేలియా 129 పరుగలకే చుట్ట చుట్టేంది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది.
సెమీస్‌
జూన్‌ 23న ఓల్డ్‌ ట్రాపెర్డ్‌ (మాంచెస్టర్‌) గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, భారత్‌లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌ జి ఫ్లవర్‌ 33, టావెర్‌ 32, లాంబ్‌ 29లు మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు నమోదు చేశారు. భారత బౌలర్లలో హర్యానా హరికెన్‌ కపిల్‌ మూడు వికెట్లు, బిన్నీ, అమర్‌నాథ్‌, చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ బ్యాట్మెన్లందరూ కలిసి కట్టుగా రాణించి భారత్‌కు విజయం సాధించి పెట్టారు. యశ్పాల్‌ 61, పాటిల్‌ 51, అమర్‌ నాథ్‌ 46 చేసి గెలుపులో కీలక పాత్ర వహించారు. బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన అమర్‌నాథ్‌కు మ్యాన్‌ ఆఫ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌ విజయంతో భారత్‌ మొదటి సారి ప్రపంచ కప్‌ ఫైనల్‌కు వెళ్లింది.
ఫైనల్‌

ఆరోజు జూన్‌ 25 లార్స్డ్‌ మైదానం సందడి సందడిగా ఉంది. 1979 ప్రపంచ కప్‌ చాంఫియన్‌ విండీస్‌, అప్పటివరకు పసికూనలుగా ఉన్నప్పటికీ లీగ్‌ దశలోనే ఒక సారి విండీస్‌ను మట్టి కరిపించిన భారత్‌ తలపడుతున్నాయి. వాతావరం చల్లగా ఉన్నప్పటికీ పరిస్థితి వాడి వేడిగా ఉంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలించడంతో భారత్‌ను 183 పరుగులకే ఆలౌట్‌ చేశారు. శ్రీకాంత్‌ 38, అమర్‌నాథ్‌ 26, సందీప్‌ పటేల్‌ 27 లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. విండీస్‌ బౌలర్లలో రాబర్ట్‌, మూడు, మార్షల్‌, హౌల్డింగ్‌ చెరి రెండు వికెట్లు తీకుని భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. దీంతో డ్రెస్సింగ్‌రూంలో నిరాశాజనక వాతావరణం నెలకొంది. అప్పుడే డ్రెస్సింగ్‌ రూంకి వచ్చిన టీం కెప్టెన్‌ కపిల్‌ అందరిని ఉద్ధేశిస్తూ.. కమాన్‌గాయ్స్ లెట్స్‌ ఫైట్‌ అన్నాడు. ఈ మాటతో అందరు ఉత్సాహంగా గ్రౌండ్‌లో అడుగుపెట్టారు. విండీస్‌ ఐదు పరుగుల వద్ద సందు గ్రీనిడ్జ్‌ (1)ను బౌల్డ్‌ చేశాడు. భారత శిబిరంలో ఒక్కసారిగా ఆనందం వెళ్లి విరిసింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రిచర్డ్స్‌, హెయెన్స్‌తో కలిసి 45 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ ఇన్నింగ్‌ను నిర్మిస్తున్న ఈ జంటను మదన్‌లాల్‌ విడదీశాడు. 13పరుగులు చేసిన హెయెన్స్‌ మదన్‌లాల్‌ బౌలింగ్‌లో బిన్నీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ (33) క్రీజులోనే ఉన్నాడు. 57 పరుగుల వద్ద మదన్‌లాల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రిచర్స్డ్‌ కపిల్‌దేవ్‌ అందుకున్న 20 అడుగుల అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. జట్టు స్కోరు 66 వద్ద గోమ్స్‌ (6) మదన్‌లాల్‌ బౌలింగ్‌లో గవాస్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అదే స్కోరు వద్ద లాయిడ్‌(8) బిన్నీ బౌలింగ్‌లో కపిల్‌ చేతికిచిక్కాడు. విండీస్‌ మరో పది పరుగులు జోడించగానే బుచ్‌ వికెట్‌ సందు తీసుకున్నాడు. అప్పటికి విండీస్‌ స్కోరు 76. ఆ తర్వాత డుజోన్‌, మార్షల్‌ ఏడో వికెట్‌కు 43 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మళ్లీ భారత శిబిరంలో కలవరం మొదలైంది. ఈ తరుణంలో బౌలింగ్‌కు దిగిన అమర్‌నాథ్‌ విండీస్‌ 119 పరుగుల వద్ద డుజోన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మార్షల్‌(18) అమర్‌నాథ్‌ బౌలింగ్ లోనే ‌ గవాస్కర్‌ మాంచి క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. వెంటనే రాబర్ట్‌ను కపిల్‌ ఎల్‌బిడబ్య్లూ చేశాడు. 52వ ఓవర్‌ చివరి బాల్‌కు హౌల్డింగ్‌ను అమర్‌నాథ్‌ ఎల్‌బిడబ్య్లూగా ఫెవిలియన్‌కు పంపాడు. అప్పుడు  లార్డ్స్‌ మైదానంతా  జైభారత్‌ అన్న నినాదాలతో నిండిపోయింది. జట్టు  సభ్యులంతా  అంబరాన్నంటే సంబరాలు జరుపుకున్నారు. విజయం వార్త అందగానే
యావత్ భారతీయులు సంబరాలు జరిపారు. భారత త్రివర్ణ పతాకం విశ్వ వినువీదులలో రెపరెపలాడింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచకప్‌లో అడుగుపెట్టి సంచలన విజయాలతో ప్రపంచకప్ ను భారత్ కు ఎగరేసుకోచ్చిన కపిల్‌ సేనకు  ఘన స్వాగతం లభించింది.
20 సంవత్సరాల తర్వాత 2003 లో మళ్ళీ భారత్‌కు కప్పు గెలిచే అవకాశమున్నా తృటిలో చేజారింది. ఇప్పుడు మళ్లీ జట్టు సమ తూకంగా ఉంది. ప్రపంచ కప్‌ ఉపఖండంలోనే జరుగుతుంది. కాబట్టి మళ్లీ కప్‌ సాధించేందుకు ఇదే మంచి తరుణం. ఆల్‌ ది బెస్ట్‌ ఇండియా.............



- సుందర్

2 comments:

  1. అంతకుముందు రెండుసార్లూ వెస్టిండీస్ గెలిచింది.. పాపం మీరు ఆస్ట్రేలియా కూడ ఒకటి గెలిచి ఉంటుందని ఊహించినట్టున్నారు. క్రిక్ఇన్ఫో నుంచి గణాంకాలని పోగు చేసి మా మీదకి వదిలినట్టుంది యవ్వారం.. ఏమంటారు??

    ReplyDelete
  2. ఏదో కష్ట పడ్డామండీ....! డైరెక్ట్ చూసి రాయడానికి మేమేమన్న 1983 ఉన్నామా...?

    ReplyDelete