అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, April 13, 2011

అరే.... ప్రిస్టేజీ చూసుకుంటే ఎంత పని అయింది.........!

నేను మా ఫ్రెండ్స్‌తో పాటు హైదరాబాద్‌లో ఉంటాను. సాదారణంగా కూరగాయలు తేవడానికి మా ఫ్రెండ్సే వెళ్తారు. మొన్న ఎందుకో నేను, మా రూంమేట్‌ నవీన్‌ సైదాబాద్‌ మార్కెట్‌కు వెళ్లాము. మార్కెట్‌ చాలా సందడి సందడిగా ఉంది. ఎవరి బిజీలో వారు ఉన్నారు. మాటకారులైన వారు తొందరగా తమ కూరగాయలు అమ్ముకుంటున్నారు. కొంత మంది అయితే మనుషులను చూసి రేట్లు చెబుతున్నారు. మమ్మల్ని చూడగానే వారికి అర్థం అవుతుంది. పోరగాళ్లు ఏం రేటు చెప్పినా తీసుకుంటారని ఇష్ట మొచ్చినట్లు చెబుతున్నారు.. మేము కొంచెం ఆలోచించి. బేరం ఆడటం మొదలు పెట్టాము. కొద్దిసేపు బాగానే వర్కౌట్‌ అయ్యింది. అయితే అన్ని కూరగాయలు తీసుకున్న తర్వాత లాస్ట్‌కు టమాటోలు ఎక్కడ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. అప్పుడే ' ఓ తమ్మి గిటు రాండ్రి మా దగ్గర మాంచి టమాటలున్నాయి.. పది రూపాయలకు నాలుగు కిలలు (కేజీలు)' అని ఒకావిడ పిలిచింది. నాలుగు కేజీలెందుకు గానీ ఒక కేజీ ఇవ్వు అన్నాన్నేను. కేజీకయితే మూడు రూపాయలంది. అదేంది నాలుగు కేజీలకు పది రూపాయలయినప్పుడు కేజీకి రెండున్నరనే కదా అన్నాన్నేను.. లేలే నాలుగు కేజీలు కొను మరి పది రూపాయలకు ఇస్తా అంది. నేను కొంచెం బిల్డప్‌గా ఒకటే కేజీ కొంటాం రెండున్నరకు ఇవ్వు అన్నాను... గట్ల కుదరదు అన్నది. అయితే మాకు కుదరదు అని వెళ్లినట్లు యాక్షన్‌ చేస్తుంటే... పెండ్లానికి గిప్పటినుండే రూపాయి.... రూపాయి కూడవెడ్తున్నావు తమ్మీ అంది నవ్వుతూ... అరే ఎంత మాట అంది... ఎన్ని షాపులు లేవు ఏ షాపులో నైనా కొందాం ఇక్కడొద్దు అని మా ఫ్రెండ్‌తో కలిసి అన్నీ షాపులూ తీరిగాము కానీ ఎక్కడా రెండున్నరకు గానీ... కనీసం మూడు రూపాయలకు గానీ కేజీ టమాటో దొరకట్లేదు.. అరే ప్రిస్టేజీ చూసుకుంటే ఎంత పని అయింది. అనుకుని చివరకు ఒక షాపులో నాలుగు రూపాయలకు కేజీ కొని తీసుకెళ్లాల్సి వచ్చింది....
సుందర్

No comments:

Post a Comment