విశ్వసృష్టికి  కారణం ఎవరనే ప్రశ్నకు ప్రఖ్యాత భౌతికశాస్త్ర వేత్త -గణిత ఆచార్యుడు  స్టీఫెన్ హాకింగ్ చాల కాలం తరువాత మనసు విప్పారు.  దేవుడు సృష్టించ లేదని  హాకింగ్ స్పష్టం చేశారు. భౌతికశాస్త్రమే ఈ విశ్వ సృష్టికి మూలమని తేల్చి  చెప్పారు. అపార శక్తిమంతమైన భూమ్యాకర్షణ ఫలితంగా భారీ  విస్ఫోటనం(బిగ్‌బ్యాంగ్) అనివార్యంగా సంభవమైందని తన నూతన రచన 'ది గ్రాండ్  డిజైన్' లో పేర్కొన్నాడు. ఈ నెల తొమ్మిదిన ఈ పుస్తకం మార్కెట్‌లోకి  విడుదల కానుంది. దాదాపు 30సంవత్సరాల పాటు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో  గణితశాస్త్ర లూకేసియన్ ఆచార్యునిగా హాకింగ్ పని చేశాడు.
గత ఏడాదే ఆయన తన  ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది.  'ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం'  (కాలం కథ') ద్వారా 1988లో  ప్రపంచానికి పరిచయమైన ఈ బ్రిటిష్ శాస్త్రవేత్త  ప్రధానంగా భౌతిక శాస్త్ర సంబంధ విషయాల్లో అనేక వినూత్న ప్రతిపాదనలు చేసిన  వానిగా ఘనత సంపాదించారు. తన గణన ప్రాతిపదికగా ఈ అనంత విశ్వంలో మానవులు కాక  గ్రహాంతర వాసులున్నారని కొన్ని నెలల క్రితం ఆయన చేసిన ప్రకటన పెను  సంచలనానికి కారణమైంది. అంతేకాక ఆ గ్రహాంతర వాసులతో సంబంధాలు పెట్టుకోవడం  మానవాళికి ప్రమాదకరమని హాకింగ్ హెచ్చరించడంపై చర్చ కొనసాగుతూనే ఉంది.  అమెరికా భౌతికశాస్త్రవేత్త లియోనార్డ్ మోడినోవ్‌తో కలసి రచించిన పుస్తకంలో  దేవుని ఉనికి లేదంటూ కొన్ని ప్రతిపాదనలు చేశారు.
తన ప్రతిపాదనలకు బలం  చేకూర్చే కొత్త సిద్ధాంతాలను మన ముందుంచాడు. విశ్వాన్ని దేవుడే  సృష్టించాడన్న సర్ ఐజాక్ న్యూటన్ విశ్వాసాన్ని 'ది గ్రాండ్ డిజైన్'లో  హాకింగ్ బలంగా విభేదించాడు. భూమ్యాకర్షణలాంటి భౌతిక నియమానుసారం శూన్యం  నుంచి విశ్వం ప్రాణం పోసుకుందని ఆయన రచన సాగింది. అకస్మాత్తుగా కళ్లెదుట  కనిపించే దాని సృష్టి వెనుక అసలేమీ లేదనుకునే కన్నా ఏదో ఉందనే భ్రమ  కలగడానికి కారణంగా ఆయన వివరించాడు. ఈభ్రమల నుంచే విశ్వ ఉనికి, విశ్వంలో మన  ఉనికి ఎలా సాధ్యమనే సందే హాలు ముప్పిరి గొంటాయని వ్యాఖ్యానించాడు.  విశ్వసృష్టికి, పరిభ్రమణానికి ఏరకమైన సిద్ధాంత ప్రతిపాదన చేయాల్సిన అవసరం  లేదని తేల్చేశాడు. తన ప్రతిపాదనల వాస్తవికత నిర్ధారణ లక్ష్య సాధనకు పోగుల  తరహా ఎం-సిద్ధాంతాన్ని ఉదహరించాడు. విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్  కనుగొనాలనుకున్న ఏకీకృతసిద్ధాంతంగా ఎం-సిద్ధాంతాన్ని ఆయన సూత్రికరించాడు.   అనేక పరమాణువులు కలయికతో ప్రకృతిలో మనం మానవులుగా ఆవిర్భవించామన్నాడు.  అంతిమంగా మనలను నియంత్రించే విశ్వ నియమాలను గుర్తించడం ద్వారా విశ్వం ఒక  విజయమని తేలిందన్నాడు.
సూర్యుడిని పోలిన మరొ తార చుట్టూ పరిభ్రమించే ఒక  గ్రహం భ్రమణ-పరిభ్రమణల క్రమాన్ని 1992లో పరిశీలన జరపడం ప్రారంభించిన తరువాత  అన్యపదార్దాల నుంచి విశ్వం ఏర్పడి ఉండవచ్చనే న్యూటన్ సిద్ధాంతానికి తొలి  సారిగా ఎదురు దెబ్బతగిలిందని ఆయన వివరించాడు. దీని నుంచి విశ్వంలో ఒకే  సూరీడున్నాడనే ప్రాచీన భావన ప్రశ్నార్ధకమైందన్నాడు. సూర్యుడు-భూమికి నడుమ  ఉన్న దూరం సూర్యుని ద్రవ్యరాశి వంటి లక్షణాలు మనం మానవులుగా పరిణామం చెందే  క్రమంలో అసామాన్య ప్రభావాన్ని కనబరిచాయని ఆయన వివరించాడు.
 ప్రజాశక్తి 02 - 09 - 2010 నుంచి సేకరించినది

No comments:
Post a Comment