అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, January 5, 2011

ఆ ఆనందాన్ని మరిచిపోలేను


సాదారణంగా ఒక బహుతమతి వస్తేనే గొప్ప అదే బహుమతి కొన్ని వేల మంది మధ్యన అందుకుంటే ఆ ఆనందానికి అవదులు ఉంటాయా.... ఆ ఆనందం నాకు 8వ తరగతిలో కలిగింది. నేను 7వతరగతి నందివనపర్తిలో చదివి 8వ తరగతికి హయత్‌నగర్‌ హాస్టల్‌కి వెళ్లాను. అన్నయ్య హాస్టల్‌లో జాయిన్‌ చేసి వెళ్లిపోయారు. ఇక చూసుకోవాలి మన బాధలు హాస్టల్‌లో ఒకటే దోమలు నైట్‌ పడుకుంటే తేనెతెట్టెకు ఎలాగైతే ఈగలు ఉంటాయో ఆ రకంగా దోమలు శరీరానికి పట్టుకునేవి ఫ్యాన్‌ వేసినా కాయిల్స్‌ పెట్టినా వాటిని ఇసుమంతైనా ప్రభావితం చేసేవికావు. ఆ దోమల బాధకు చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నా. ఇక స్కూల్‌ విషయానికి వస్తే మా 8వ తరగతి 'ఎ' సెక్షన్‌లో 120 మంది ఉండేవారు. నేను జాయిన్‌ అయినప్పటికే చాలా మంది మా హాస్టల్‌ ఫ్రెండ్స్‌ జాయినయ్యారు. అరే బహుమతి అన్నాడు ఏదో సొల్లు చెబుతున్నాడు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా..
ఆ రోజు నేను స్కూల్లో జాయినయ్యా.
అప్పటికే సెక్షన్‌లో చాలా ఎక్కువ మందిఅవ్వడంతో టీచర్‌గారు ఇక  ఎవరు జాయినయ్యినా ఇబ్బంధి పడుతున్నారు. ఎందుకంటే అంత మందిని కంట్రోల్‌ చేయడం కష్టం కదా... ఇక ఆరోజు నేను క్లాస్‌లోకి వెల్లగానే 'మంది తక్కువ ఉన్నారని వచ్చావా' అని టీచర్‌ అనగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అంతకు ముందు  క్లాసుల్లో ఏ టీచర్‌తో కానీ సార్‌తో కానీ తిట్లు తిన్న సందర్భాలు లేవు. ఇక చాలా ఫీలవుతూ.. కూర్చున్నాను. అప్పుడు మేడమ్‌గారు ఆన్నారు. గురువారం నాడు మండల కేంద్రం వద్ద ఎమ్మెల్యే మీటింగ్‌ ఉంది అక్కడికి అన్ని స్కూళ్ల నుంచి విద్యార్థులు వస్తారు. అక్కడ మన స్కూల్‌ నుంచి పాట పాడాలి కాబట్టి అన్ని క్లాసుల నుంచి సెలక్ట్‌ చేస్తున్నాము మీ క్లాసులో ఎవరన్నా పాడాలనుంకుంటే పేర్లు ఇవ్వవచ్చు అని చెప్పింది. చాలా మంది పేర్లు ఇస్తున్నారు,  ఎవరు పాడాలనుకుంటే వాళ్లు వచ్చి మొదట  క్లాసులో పాడిన తరువాత అందులోంచి టీచరు సెలక్టు చేస్తానన్నారు. చాలా మంది మంచి మంచి పాటలు పాడారు. అందరు పాడటం అయిపోయిందా... అని మేడమ్‌  అడిగారు.. ఆ.. అయిపోయింది. మేడమ్‌ అనే సమాదానం ముక్తసరిగా విద్యార్థుల నుంచి వచ్చింది. అప్పటికి నేను పాట పాడలేదు. పాడినవారిలో నుంచి  బాగా పడిన 'నాగరాజు' అనే విద్యార్థిని ఎంపిక చేసి నువ్వు గురువారం రోజు మండలాఫీసు దగ్గర పాడాలి బాగా ప్రిపేరవ్వు అంటూ మేడమ్‌ వాడికి సలహాలు ఇస్తోంది. అప్పుడు వనపర్తిలో నాతో పాటు చదివిన ఫ్రెండ్స్‌ పాడరా శ్రీను.. పాడరా.. పాడరా అంటూ గుసగుసలాడుతున్నారు. అప్పుడే మమ్మల్ని గమనించింది మేడమ్‌.. ఏమంటుందో అని మా అందరిలో ఒకటే టెన్షన్‌ మొదలైంది. కానీ మేడమ్‌  చాలా ప్రశాంతంగా ఏమైందమ్మా ఏంటీ గుసగుసలు రెండు నిమిషాలు నిషబ్దంగా ఉండలేరా.. అంది. అప్పుడు మా ఫ్రెండ్స్‌ చెప్పారు. 
ఏం లేదు టీచర్‌ మా శ్రీను పాటలు చాలా బాగా పాడుతాడు టీచర్‌ అని సమాదానం ఇచ్చాడు మా ఫ్రెండ్‌ గిరి. ఏది ఒక పాట పాడు అన్నది మేడమ్‌ లేచి నిల్చున్నాను. అప్పటికే సెలక్షన్‌ అయిపోయింది కదా...? అని సైలెంట్‌గా నిల్చున్నాను. పర్లేదు పాడమ్మా అంది మేడమ్‌ మరోసారి. మెల్లెగా పాట స్టార్ట్‌చేసాను. 'నా చిట్టీ చేతులు సక్కని రాతలు' అనే పాట పాట పాడాను. పాట అయిపోయే సరికి మేడమ్‌ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అఫ్‌కోర్స్‌ నేను చాలా ఫీలవుతూ పాడాను దాంతో నా కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఏముంది ముందు సెలక్టయిన పేరు క్యాన్సల్‌ చేసి నువ్వే పాడు బాబు నీ పేరేంటీ? అని అడిగింది మేడమ్‌ శ్రీనివాస్‌ అని చెప్పాను. ఈ పాటనే పాడు బాబు అంది కాదు మేడమ్‌ ఇంతకు ముందు అతను పాడిన పాట పాడుతాను అని చెప్పాను ఆ పాట 'నిర్మల సుర గంగా జల సంగమక్షేత్రం' అనే పాట. ఆ అబ్బాయి వద్ద ఆ పాట తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి. పాట మొత్తం చాలా బాగా నేర్చుకున్నాను.
ఇక గురువారం రానే వచ్చింది. ఆరోజు హయత్‌నగర్‌లోని అన్ని స్కూళ్ల విద్యార్థులు అక్కడికి వచ్చారు. సుమారు రెండు వేల మంది విద్యార్థులుంటారు. ఇక ఆ ప్రోగ్రాంకు చీఫ్‌గెస్ట్‌ ఎమ్మెల్యే ఇంద్రసేనా రెడ్డి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌. మండల్‌ ఎంపిపి మల్‌రెడ్డి రాంరెడ్డి వచారు. ప్రోగ్రాం ప్రారంభమైంది. స్టేజీ మీదకు గెస్టులను ఆహ్వానించారు. అప్పటికే వచ్చిన అథిదులు ఇద్దరు స్పీచ్‌ ఇచ్చారు. స్కూల్లో నిర్వహించిన గేమ్స్‌కు అక్కడ ప్రైజులు కూడా ఇచ్చారు. చాలా వరకు ప్రోగ్రాం అయిపోవచ్చింది. నేను మేడమ్‌ పక్కనే నిల్చున్నాను. ప్రోగ్రాం అయిపోవచ్చిందని నేను నీళ్లు తాగడానికి వెళ్లాను.. ఆ నీళ్లు మీటింగ్‌కు అవతల వైపు  కొద్దిగా దూరంలో పెట్టారు. నీళ్లు తాగుతున్నాను అప్పుడే హయత్‌నగర్‌ జిల్లాపరిషత్‌ స్కూల్‌ నుంచి శ్రీనివాస్‌ వచ్చి పాట పాడుతాడు అనే మైక్‌ అనౌన్సు వినిపిచింది. దెబ్బకు నీళ్లు అక్కడ పెట్టాను చాలా కంగారు కంగారుగా స్టేజీ వద్దకు వస్తున్నాను మరో సారి అనౌన్సు చేసారు. స్టేజీ ఎక్కాను అంత మందిని ఒక్కసారి చూసే సరికి చెమటలు పట్టాయి. కొద్దిసేపు సైలెంట్‌గా నిల్చున్నాను. పాడు బాబు పాడు అనే మాట వినిపించింది. గొంతు వణుకుతుంది. మెల్లగా పాట స్టార్ట్‌చేశాను. 'నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం' అని పాడుతున్నాను.. అప్పటివరకు గోళగోళగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అందరు చాలా సీరియస్‌గా వింటున్నారు. ఆ సైలెంట్‌ను చూసి నాకు భయం వేసింది. అప్పటికే ఒక పల్లవి ఒక చరణం పాడాను... అంత టెన్షన్‌లో పాట మర్చిపోయాను మళ్లీ పల్లవి అందుకున్నాను. చరణం గుర్తురావడం లేదు అంతే ఇక పాట ఆపేసాను. ఏమనుకుంటారో అనుకుంటూ అందరి వైపు పరికించి చూస్తున్నాను. అప్పుడే పక్కనుంచి టక్‌టక్‌టక్‌ అనే చప్పట్ల శబ్దం వినిపించింది. తిరిగి చూస్తే మా మేడమ్‌ ఇక అందరు చప్పట్లు అందుకున్నారు. ఆ చప్పట్ల శబ్దానికి గుండె డక్‌డక్‌ కొట్టుకుంటుంది. వెంటనే ఎమ్మెల్యే లేచి హత్తుకున్నాడు. జ్ఞానేశ్వర్, మరియు‌ ఎంపిపి లేచి భుజం తట్టారు. ఎమ్మేల్యే ఒక బొకే ఇచ్చి.. వంద రూపాయలు చేతిలో పెట్టి బాలసుబ్రమణ్యాన్ని మించిపోతావు అన్నారు. దాంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏమవుతుందో అర్థమవట్లేదు. అందరూ చాలా స్పెషల్‌గా చూస్తున్నారు. చాలా మంది నా చుట్టూ గుమిగూడారు ఒకాయన వచ్చి అరటి పండు వలిచి నోట్లో పెట్టాడు. తిన్నాను తర్వాత తెలిసింది అతను మా తెలుగు సార్‌ అని. తర్వాత చాలా మంది వచారు పలకరించారు దెబ్బకు ఆ పాటతో స్కూల్లో హయత నగర్ లో పాపులర్ అయిపోయాను. అప్పటినుండి స్కూల్లో ఏ ప్రోగ్రాం అయినా నా పాట తప్పకుండా ఉండేది. ఆ పాటనే మూడు సంవత్సరాలు హయత్ నగర్ లో చదివేల  చేసింది. అప్పటినుండి నా పేరు నిర్మల సుర శీను  అయ్యింది   ఆ మూడు సంవత్సరాలు.
(ఆ ఆనంద క్షణాలు ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతూనే ఉన్నాయి. ఇన్ని రోజుల తర్వాత  మీతో పంచుకుంటున్నందుకు చాల సంతోషంగా ఉంది.)

సుందర్

1 comment:

  1. Hi Sundar,Paata paadi record chesi aa link kuda ikkada ichi unte baagundedhemo.....naaku aa pata vinali ani undhi...meeru class lo paadina paata kuda..

    Idhantha chadivaka alane abhiprayapadatharu evarina...

    Congratulations any how!!!

    Priya.

    ReplyDelete