అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Tuesday, December 20, 2011

నా ఊరు... ఇలా కావడానికి కారణం...?

నా చిన్నప్పుడు మా ఊరు పొద్దున లేచినప్పటినుండి రాత్రి పడుకునేదాకా.. ఆటా, పాటలతో.. సాంస్కృతిక కళలతో కళకళలాడేది. నేను.. పొద్దు  పొద్దున్నే  ఒక జేబు నిండా గోటీలు (గోళీలు) వేసుకుని దోస్తులతో యలుదేరేవాణ్ణి... మధ్యాహ్నం 12, 1 అయితే గాని ఆకలి గుర్తొచ్చేదికాదు. ఆటలో మునిగిపోయేవాళ్లం... ఇక మధ్యాహ్నం కొద్దిగా తిని.. మళ్లీ గిళ్లిజాండు (గిళ్లి, దండు, గిళ్లి గోన) ఆడేందుకు వెళ్లే వాళ్లము.. ఊర్లో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఆడేవారు. ఆ ఆటలో ఆ ఆనందమే వేరు... నేను అందరికన్నా చిన్నగా ఉన్నా టీంలోకి తీసుకునే వారు.. ఇక ఒక గేమ్‌ గెలిపించినా వారి నుండి వచ్చే ప్రశంసలు అబ్బో... తట్టుకోలేకపోయేవాణ్ణి... ఆ ఆటలో ఒకరిగురించి ఒకరు చెప్పుకోవడం ''వాడు మస్తు ఆడతాడురా అంటే వీడు ఉద్ధండుడురా'' అంటూ రన్నింగ్‌ కామెంటరీలు చేస్తుంటే... ఆడే వారికి అవి కొండంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేవి. సాయంత్రం నాలుగు దాటితే... నాలుగు డబ్బాలాట.. ఉప్పుగెర్రె.. ఆటలు ఆడేవాళ్లము... ఆ ఆటల్లో చాకచక్యం కలివిడి తనం బాగా నేర్పేవి... ఇక సాయంత్రం ఆరు అయితే దాగుడుమూతలు.. మక్కు గిచ్చే ఆట.. కాంటలాట... గ్రామం అంతా సందడి సందడిగా ఉండేది.. ఈ ఆటలున్నీ మొత్తం పూర్తయ్యే సరికి రాత్రి తొమ్మిది పది అయ్యేది. అప్పుడు మెళ్లిగా ఇంటికి వెళ్లి తిని ఆరుబయట పడుకుని చుక్కల్ని చూస్తూ చెప్పుకునే పొడుపు కథలు... కథలు... ఇప్పటికీ, ఎప్పటికీ అవో మధుర స్మృతులు... ఇక ఎండాకాలం వస్తే.. ఈతకు వెళ్లేవాళ్లము.... ఈతలో ఒక్కొరి విన్యాసాలు చూస్తుంటే ఇప్పటి ఇంటర్నేషనల్‌ స్విమ్మింగ్‌ ప్లేయర్లు కూడా వీరిముందు పనికిరారేమో .. చాలా ఎత్తునుంచి (మోట్ల పైనుంచి ) డైవ్‌ కొట్టడం... నీళ్లలో ఆటలతో టైంమే తెలిసేది కాదు.. కోతి కొమ్మచ్చి ఆటలో... కోతులను మించిన కోతులుండేవారు.... అప్పుడప్పుడూ కాళ్లు చేతులు.... విరగొట్టుకున్న వాళ్లూ ఉన్నారనుకోండీ... ఇక ఏదైనా పండగ వచ్చిందంటే... కోళాటం... పాటలు... డప్పు విన్యాసాలు , నాటికలు నేర్పేవాళ్లు.. పండగ రోజు ఒక్కొక్కరి ఫర్ఫార్మెన్సు చూడాలి.. మళ్లీ పండగ వచ్చేదాకా అవి చెప్పుకుంటూ నవ్వుకుంటూ...గడిపేవాళ్లము.. ఇక నా ఎనిమిదవ తరగతిలోనో.. తొమ్మిదవ తరగతిలోనో మా ఊరికి కేబుల్‌ వచ్చింది. అప్పుడు జెమినీ.. ఈ టీవీల్లో రోజు మూడు సినిమాలు వచ్చేవి ఇక కరెంటు ఉంటే.. చాలు టీవీలకు అ తుక్కుపోయేవాళ్లం... అప్పుడు మా ఊళ్లో నాలుగైదుగురి ఇళ్లల్లో మాత్రమే టీవి ఉండేది వాళ్ల ఇళ్లలో జనమంతా నిండిపోయేవారు... విచిత్రమేంటంటే వాళ్లు కూడా ఎవ్వరొచ్చినా కింద ఒక చాప వేసి కూర్చో బెట్టేవారు కానీ విసుక్కునేవారు కాదు.. ఇక మెళ్లిగా ఈ ఆటలకు దూరమయ్యాం... రాను రాను ప్రతి ఒక్కరి ఇంట్లో టీవి అయ్యింది. అప్పటి నుండి ఒక పండగలేదు పబ్బం లేదు.. ప్రతి ఒక్కరూ టివీలకు అతుక్కుపోవడం.. సినిమాల ప్రభావమో.. లేక నడుస్తున్న కల్చరో తెలీదు చిన్నపిల్లాళ్లు సైతం లవ్వూ.. గివ్వూ అంటూ తిరగడం..... ఇలా క్రమ క్రమంగా గ్రామ వాతావరణం కాస్త... గలీజ్‌గా తయారైంది.. ఇప్పుడైతే ఏడెనిమిది తరగతులు చదివితే చాలు బీర్లు, మందు... అబ్బ చండాలంగా తయారయ్యారు... ఇదీప్రపంచీకరణ పుణ్యమే.. ఒక వైపు అభివృద్ధి జరుగుతోంది అని ఆనండపడాలా... లేక సంస్కృతి సంకనాకిపోతోందని బాధపడాలా అర్థంకావట్లేదు....
సుందర్

1 comment:

  1. బాగా వ్రాశారండి. నిజమే, ఇప్పుడు పండగలు పబ్బాలు అన్నీ కూడా టీవీలే...ఇంట్లో వున్నవారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా పోయింది. అయితే దానికి కారణం టివీ మాత్రమే కారణం కాదు. దానితో బాటు మరో రెండు సాధనాలు మనని విడదీస్తున్నాయి....ఒకటోది టీవీ అయితే రెండవది సెల్ల్ ఫోనులు...మూడవది కంప్యుటరు[నెట్టుతో కలిపి]. ఈ దుష్టత్రయ ఎలక్ట్రానిక్ సాధనాల వలనే ఈ రోజులలో అనేక దుష్పరిణామాలు వస్తున్నాయి. కాకపోతే వాటిని దుష్టత్వంగా మార్చింది మన "అతి" లేక "మూర్ఖత్వం" మాత్రమే.

    దేనినైనా తగుమాత్రం తీసుకుంటే మంచిదే. కానీ, మన వాళ్ళు చేసిన అతి వల్ల ఎంతో ఉపయోగకరమైన పై వస్తువులను తిట్టాల్సి వస్తోంది. మన వాళ్ళు అదుపు తప్పటం వలన అమృతమే విషమయ్యింది; కానీ, పద్ధతిగా ఉపయోగిస్తే "విషాన్ని కూడా ప్రాణావసరమైన మందు చేసి అమృతంగా మార్చవచ్చును...

    ReplyDelete