అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Monday, October 18, 2010

నా చిట్టీ చేతులు

పల్లవి : నా చిట్టీ చేతులు సక్కనిరాతలు నేర్వలేదయ్యో
నా సంకల మేడితో సాలీరు వాలును దున్నీనానయ్యో
చరణం : నను గన్నా వాళ్లకు ఏడేండ్లప్పుడే దూరమయ్యానే
దొరగారీ ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యానే
మూడు మూరల కర్రతో ముప్పై ఎడ్లతో సోపతి నాదయ్యో
దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కాళ్లకు గుచ్చెను ముళ్లయ్యో
అయ్యో గెచ్చెను ముళ్లయ్యో
\\నా చిట్టీ చేతులు//
చరణం : వెలుగుపోయి చీకటి కమ్మీనప్పుడు ఇంటికి పోతానే
నా అమ్మా అయ్యా రాకముందే నిద్దుర పోతానే
సుక్కగూకిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా
తెళ్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ల బావికాడుంటా
నీళ్ల బావికాడుంటా\
\\నాచిట్టీ చేతులు\\
చరణం : బొక్కముదరని రెక్కలు బరువులు మోసీ నొయ్య బెడుతుంటే
తేపతేపకుదొరగసాని రోకలి పోటుల మాటలంటుంటే
అయ్య చేసిన అప్పూ ఉచ్చుల నేను చిక్కుకున్నానే
ఆ వడ్డీ లెక్కలకంటే ఎక్కువ కష్టం చేసితినే
ఎక్కువ కష్టం చేసితినే
//నా చిట్టీ చేతులు//
చరణం : వాళ్ల గొడ్లకు ఉలువల పిండీ బెట్టీముద్దుగ జూస్తారే
కడుపు గాలిన నాకు గొడ్డూ కారం ముద్దలు పెడతారే
ఒంటికి సిల్లులు బడ్డా అంగి నాకు ఒక్కటున్నాదే
వాళ్ల బిడ్డలకేమో రోజుకు రంగుల అంగీలు మారేనే
రంగుల బట్టలు మారేనే..
//నా చిట్టీ చేతులు //
చరణం : పెద్దోళ్ల బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం
నేను చేసిన పనులకు ఇచ్చే భిరుదులు ఎంతో ఇకారం
సదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడుంచకురే
నా గుండెల మీద పుండును రేపే పనికి పంపకురే
అమ్మా నాన్న అందరికీ నే దండం బెడుతున్నా
నా బాధను గాదను ఆలోచించని కాళ్లు మొక్కుతున్నా...
మీ కాళ్లు మొక్కుతున్నా..

సుందర్

No comments:

Post a Comment