అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, September 8, 2010

నా పల్లె

నిశి రాతిరి కమ్ముకుని ఉంది. ఆకాశం మబ్బులు కమ్ముకుని ఉండటంతో పున్నమి రాత్రి అయినా గాఢాందకారం అలుముకుని ఉంది. మిడతల చప్పుడు తప్ప అంతా ప్రశాంతంగా ఉందా ఊరు. ఊరు చివర విసిరేసినట్టున్న ఒక గుడిసెలో ఆ చీకటిని చీల్చేందుకు శతవిదాలా ప్రయత్నిస్తూ మినుగుమినుగుమంటున్న చిన్న దీపం ఉంది. అప్పుడే 'చిల్‌ చిల్‌' కళ్లాపి(సాంపి) చల్లే శబ్దం మొదలైంది.... అలా నాలుగైదు నిమిషాలు వినిపించి సడెన్‌ గా ఆగిపోయింది. మళ్లీ 'చిర్‌ చిర్‌' అనే వాకిలి ఊడిసే శబ్దం మొదలైంది. ఆ చప్పుడు విన్న కోడిపుంజు నిద్ర నుంచి ఉలిక్కి పడి లేచి గుడిసెక్కి కూర్చుంది. కూద్దామా వద్దా అనే సందేహంతోనే కొక్కొరోకొ అనేసింది. ఇంకేముంది ఈ కోడి పుంజు గొంతుకు ఊళ్లోని కోళ్లన్ని గొంతు కలిపాయి. ఒక్కసారి ఊరంతా కోడి కూతతో మారుమోగింది.మబ్బులు తొలగడంతో పండు వెన్నెలకు గుడిసె ముందు ఒక రూపం మసక మసకగా కనిపిస్తుంది. ఇంకొద్దిగా ముందుకెళ్లి చూడగా  చీర నడుముకు చుట్టి, కుచ్చిల్లు పైకి చెక్కి... జారుతున్న ముంగురులను సర్ధుకుంటూ....పదహరణాల తెలుగింటి ఆడపడుచు చేతిలో పళ్లెంతో నిల్చుంది . ఆ పళ్లెంలో బహుషా ముగ్గు ఉన్నట్టుంది. ఎందుకంటే తడి ముగ్గును పొడి చేసేందుకు వేసిన నిప్పు కనికల, మినుగురులు గాలివాటుకు  ఎగిరపోతున్నాయి. ముగ్గుచుక్కలు చుడుతున్న ఆమె వేళ్లు బొంగరంలా చకచక కదులుతున్నాయి. కొద్ది సేపటికి వాకిలిమొత్తం చుక్కలతో నింపేసింది. విడివిడిగా ఉన్న ఆ చుక్కలను కలిపేందుకు వడివడిగా సాగుతున్న ఆమె చేతివేళ్ల నుంచి జాలువారుతున్న తెల్లని ముగ్గు ఆవు పొదుగు నుంచి జారుతున్న పాలదారను తలపిస్తోంది. అరగంటలో పాలపుంతను తల దన్నే ముగ్గు ఆ గుడెసె ముందు వాలి పోయింది. ముగ్గు ముందు వెలవెల బోతామనుకున్నాయేమో ఆ నింగి చుక్కలు దెబ్బకు మాయమైపోయాయి.
అప్పుడే ఆవుదూడెకు ఆకలి గుర్తొచ్చిందేమో అంబా అంటూ అరవసాగింది. పక్కనే ఉన్న తల్లియావు తల్లడిల్లిపోతూ అంబా అంటూ తన బిడ్డను ఓదార్చుతున్నట్లు అరిచింది. ఆ అరుపులకు కొద్దిసేపుసేపు చుట్టుపక్కగుడిసెల నిద్రమత్తు వదిలిపోయింది. అప్పుడే ఒక చిన్న పోరడు గుడిసెలోంచి దిగ్గున ఉరికొచ్చి దూడ పలుగు విడిచాడు. ఒక్క గెంతులో దూడ అమ్మ చెంతక చేరి పొదువులో ఒదిగి పాలు తాగసాగింది. అప్పుడే వచ్చిన ఆ ఇంటాయన పాలుపితకడానికి దూడను పక్కకీడ్వసాగాడు తల్లిపొదువును వదలలేక ఆ పిల్లదూడ అక్కడే పట్టుపట్టుకుని నిల్చుంది. ఒక్కసారిగా గట్టిగా గుంజి పక్కకు కట్టేసి పాలు పితకసాగాడు. మూతికి అంటుకున్న నురగ ఒక్కలుచుక్కలుగా కింద పడుతుంటే తల్లివేపు గోముగా చూస్తుందా పిల్లదూడె తల్లియావు కూడా మేతను తినడం మానేసి తన పిల్లనే చూస్తూ ఉంది. అంతకంటే ఏంచేస్తుంది పాపం. పాలు పిండడం  రెండు నిమిషాల్లోఅయిపోయింది.  దూడ తలుగు విప్పగానే ఒక్క ఉదుటున్న తల్లిని చేరి తల్లిపొదువులో ఒదిగిపోయింది.
ఇక తెల్లవెలుగులు రావడంతో గంపకింద కోడిపిల్లలు తల్లికోడి రెక్కల కిందనుంచి వస్తూ పోతూ ఆడుకుంటున్నాయి. గంప తెలరవగానే స్వేఛ్చాయుత వాతావరణంలోకి దిగ్గున లేచి ఉరికాయి. తల్లికోడి మాత్రం తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలకు ఆహారం సంపాదించడం నేర్పిస్తుంది.
పొయ్యి వెలిగించి కలో గంజో వండుకుని కొంచెం తిని కొంత కూడును  సద్ది కట్టుకుని బ్రతుకుపోరాటానికి బయలు దేరింది ఆ జంట. ఆ పిల్లాడు మాత్రం చిరిగిన చొక్కా రెండు మూడు మాసికలున్న లాగు ఒక్క పక్క జారిపోతుంటే ఒక చేతిలో లాగు మరో చేతిలో సగం ఇరిగిపోయిన పల్కను చేత పట్టుకుని బడికి బయలు దేరాడు..
సుందర్ 

No comments:

Post a Comment