అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Sunday, July 1, 2012

తెలంగాణా వాదాన్ని.. వాడుకుంటున్నారు...

అది అసెంబ్లీ ముందున్న తెలంగాణా అమరవీరుల స్మారక స్థూపం... అక్కడ చాలా మంది విద్యార్థులు... గుండెలోతుల్లోంచి.... మా తెలంగాణా మాగ్గావాలే... అని గొంతులు చించుకుంటున్నారు.. అమరులైన ఆరొందల మంది త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడుతున్నారు.....నివాళ్లర్పిస్తున్నారు. అప్పుడే ఎసి కార్లో నుండి  దిగి వచ్చాడో నాయకుడు.. మైకు చేతిలందుకుని మా తెలంగాణాకు అన్యాయం జరిగింది... జరుగుతూనే ఉంది... అని ఊర దంచుడు దంచుతోండు... అది విన్న విద్యార్థులు... ఉద్రేకంతో ఊగిపోతున్నారు. చివరికి ప్రసంగం ముగిసింది... ప్రాణాలైనా అర్పిస్తాం తెలంగాణా సాధిస్తాం (కొననాలుక చివరనుంచి ఊడిపడ్డ) డైలాగ్‌తో ఆ నాయకుడి ప్రసంగం ముగిసింది . విద్యార్థులు మాత్రం ఆ నినాదాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు గుండెల్లో నింపుకున్నారు. ఇగ తెగ ఆలోచిస్తుండ్రు మా తెలంగాణాకే ఎందుకు ఇట్ల కావాలే... అని మదనపడుతూ... మా స్నేహితుడు (పేరు చెప్పలేను) సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టుకున్నాడు.. దాని సారాంశం నా తెలంగాణాకు అన్యాయం జరుగుతుంది.. నా చావుతోనైనా తెలంగాణా రావాలి అని ఉంది. ఆ లెటర్‌ అనుకోకుండా మాకు దొరింకింది. వాణ్ణి సెట్‌ చేయాలంటే తలప్రాణం తోకకు వచ్చింది.
అసలు అన్యాయం జరిగింది తెలంగాణా ప్రజలకా... రాజకీయ నాయకులకా అని పరిశీలిస్తే. ఏ అండా దండా లేని సామాన్య ప్రజలకే  తీవ్రమైన అన్యాయం జరిగింది. నాయకులు మాత్రం కోట్లకు  కోట్లు సంపాదించి ఆ కోట్లను కద్దరు కోట్లకిందా... అసెంబ్లీ సీట్లకింద దాచుకునేందుకు ఎన్నికల డ్రామాలు విజవంతం చేసుకునేందుకు ఈ తెలంగాణా వాదాన్ని  బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. అమాయకుల ప్రాణాలు ఒక్కొక్కటి తెలంగాణా మాతల్లి ఒడిలో రాలిపోతున్నాయి. తెలంగాణా గురించి ఒక వేణుగోపాల్‌, ఒక యాదగిరి..ఇలా ఆరొందల మంది సామాన్య ప్రజలు ప్రాణాలను అర్పించారు. కానీ ఒక  కెసిఆరో.. అతని కొడుకో... అల్లుడో... ఎవ్వడూ.... ఎవ్వడూ... పోలేదు ఎందుకంటే.. వారికి తెలంగాణా కంటే వారి పదవులు ముఖ్యం. ప్రజలు ఏమైతేనేం.. తేరగా అంది వచ్చే ప్రజా ధనం ముఖ్యం. తెలంగాణా వస్తే నీకేం పదవి నాకేం పదవి అని వారిలో వారు తన్నుకోవడం తప్ప చేసిందీ... చేస్తోంది ఏమీ లేదు..
తెలంగాణా వస్తే ఒక్క అర్థరాత్రిలో మన బతుకులన్నీ మారిపోతాయంటూ ఊదరగొడుతుంన్న  ఈ రాజకీయ నాయకులు ఎప్పటినుండో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నారు కదా అప్పుడు ప్రజలకు ఏం చేశారు. ఇప్పుడు రాష్ట్రం వస్తే మళ్లీ వీళ్ళే కదా గద్దేనేక్కేది.. వీళ్ళు  ఒకరిమీద ఒకరు బురుద జల్లుకుంటూ. ఆస్తులు దండుకునుకుంటూ... అధికారాన్ని దక్కించుకునేందుకే పాకులాడుతారు తప్ప ప్రజలకు మంచి చేసే చిత్తశుద్ధి నాయకులకు ఉందా...????
తెలంగాణ గురించి తల నరుక్కుంటా అని ప్రగల్భాలు పలికిన మన కెసిఆర్‌ గారి రాజకీయ జీవితాన్ని ఒక సారి పరిశీలిస్తే 1985లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1987-88లో మంత్రి వర్గంలో స్థానం సంపాదించాడు. 1992-93 పబ్లిక్‌ అండ్‌ టేకింగ్‌ ఛైర్మన్‌గా పనిచేశాడు. 1997-98లో కేబినెట్‌ హౌదా మంత్రి పదవి కూడా పొందాడు. ఇక 1999-2001మధ్య రాష్ట్ర శాసనసభకు డిఫ్యూటీ స్పీకర్‌గా పదవి నిర్వర్తించాడు. అన్ని పదవులు ఎలగబెడుతున్నపుడు గుర్తురాని తెలంగాణా.. తెలంగాణా ప్రజలు.. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం.. తెలుగుదేశం పార్టీనుండి తన్ని తరిమేసినతర్వాత పొడుసుకొచ్చింది. ఇక ప్రత్యేక తెలంగాణా పేరుజెప్పుకుని 2004లోనే మంత్రి పదవి కూడా పొందారు ''ఇగ తెస్త సూడుండ్రి అగ తెస్త సూడుండ్రి అని ఢిల్లీ పోవుడు ఢళ్లుగా వచ్చుడు''. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇదే తంతు. అటు ప్రజా సమస్యలు పట్టింకోలేదు ఇటు తెలంగాణా తేలేదు. కానీ ఆ నినాదం ద్వారా వచ్చే ధన పవాహాన్ని బాగానే వెనకేసుకున్నాడు. ఇక ఆమధ్య కాలంలో సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోయి రెండు గ్రూపులుగా విడిపోయి. అసమ్మతివాదులు నానాటికీ పెరిగిపోయారు. ఇంట్లోనే కొడుకు, అల్లుడు, కూతురు మధ్య తీవ్రమైన ఆదిపత్యపోరు నడుస్తోంది. ఆపరేషన్ ఆకర్శలో భాగంగా చాలా పార్టీ నాయకులు మంది జంపింగుల  ప్రయత్నాలలో, బిజి బిజీగా ఉన్నారు ఇలాంటి తరుణంలో పార్టీని కాపాడుకోవాలి ఉన్న ఇజ్జత్‌ కాపాడుకోవాలని ఆమరణ నిరాహా దీక్ష అన్నాడు.
 అప్పటివరకూ తెలంగాణా ప్రజలలో నిద్రాణమై ఉన్న ఆకాంక్ష ఒక్కసారిగా పెళ్లుబికింది ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ  యూనివర్సిటీల  విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలిపారు. అది తెలంగాణా అంతా పాకిపోయింది. ఇక పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన కాంగ్రెస్‌ కెసిఆర్‌ను కొనేసి నిమ్మరసం తాగిస్తే, ఉద్యమాన్ని చల్లార్చోచ్చనీ,  కెసిఆర్‌తో బేరమాడి నిరాహార దీక్షను విరమింపజేసి పనయిపోయిందనకున్నారు.

కానీ సీన్ రివర్స్  అయింది కెసిఆర్‌ కాదు మాకు కావలిసింది తెలంగాణా అంటూ తెలంగాణాలోనే కెసిఆర్‌ దిష్టిబొమ్మలు తగలబెట్టడంతో దెబ్బకు బిడ్డకు సుక్కలు కనిపించనయ్ ... తూచ్‌ నేను నిమ్మరసం తాగలేదు అని మళ్లీ డ్రామా రీ స్టార్ట్‌ చేసిండు. ఇగ గప్పుడు ఆ ఉద్యమ సెగ ఢిల్లీకి తాకింది అఖిల పక్షం అన్నారు. అందులో ఒకరిద్దరు తప్ప దాదాపు అన్ని పార్టీల వాళ్ళు  మాకు సమ్మతమే అన్నారు. ఈ  క్రెడిట్‌ మేమే దక్కించుకోవాలని సోనియమ్మ పుట్టినరోజు కానుకగా డిసెబర్‌ 9న తెలంగాణా ప్రకటించారు. తెల్లారకముందే కుటిల రాజకీయాలు మొదలయ్యాయి. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. శ్రీకృష్ణ కమిటీ అన్నారు. అది వచ్చింది పోయింది. ఏం తేలలేదు సకల జనుల సమ్మె ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందులో కూడా నష్టపోయింది సాధారణ ప్రజలే. నానాటికీ ప్రజలలో నమ్మకం సన్నగిళ్లుతోంది. అభివృద్ధి కుంటుబడిపోయింది. అయినా కేంద్రంలో చలనం లేదు. స్వార్థ రాజకీయ నాయకులను నమ్మి తెలంగాణా విద్యార్థులు చదువును, జీవితాన్ని పణంగా పెట్టి పోరాడితే మిగిలింది లాఠీ దెబ్బలు, పోలీసు కేసులు.
కెసిఆర్‌, మరియు ఇతర తెలంగాణా కాంగ్రెస్‌, తెలుగు దేశంనాయకులకేంది పదవులూ,  తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు... కానీ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివే, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలలోని మారుమూల గ్రామాలనుండి ఎంతో కష్టపడి చదివి సీటు సంపాదించిన ఒక పేద విద్యార్థి పరిస్థితి అది కాదు అతనిమీదనే కుటుంబం ఆదారపడి ఉంటుంది. నా కొడుకు ఎంతో బాగా సదువుతుండని, సంపాదించి నా గుడిసెను ఇళ్లు జేస్తడేమో, నాకు కడుపు నిండా మూడు పూటలా తిండిపెడ్తడేమో, నా కష్టాన్ని కడతేరుస్తడేమో అని కళలు కంటారు. తమ ప్రానానికి ప్రాణమైన బిడ్డలమీద గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న కొడుకు శవాన్ని చూసి గుండెలు బాదుకుంటున్నారు. కొడుకు మీద బెంగతో మంచం పడుతున్నారు.
ఆ రోజు టివిల్లో వార్తా పత్రికల్లో వచ్చేందుకు నాటకాలాడే రాజకీయ నాయకులు మళ్లీ ఆ అనాదులైన ముసలి తల్లిదండ్రులను పట్టించుకుంటరా...??? 

అంటే మళ్ల ఓట్లు రావాలే మళ్ల ఆ అమరవీరుల పేర్లు చెప్పుకోని ఓట్లు రాల్చుకోవాలె గప్పుడే వస్తరు. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను ఇలాగే నాన్చుతూ మళ్లీ 2014లో ఎన్నికలముందు తమకు అనుకూలంగా మలచుకునే  ఆలోచనలో ఉంది. ఎందుకంటే వాళ్ళకు ప్రజల ప్రాణాలు, శ్రేయస్సు ముఖ్యం  కాదు అధికారమే పరమావది  కాబట్టి మళ్ళీ అప్పుడు ఉపయోగించుకుటారు తెలంగాణా వాదాన్ని తెలుగు  ప్రజలను.

సుందర్

2 comments:

  1. కరెక్టుగ చెప్పినవ్ అన్నా!

    ReplyDelete
  2. I hope everyone understands these sad truths and figures out how to win in life, rather than dying for stupid politicians. There are lots of opportunities in this world, go for it. I am sure there are lots of bad things done to specific groups in the state and i am sure it is done with the help of greedy politicians from all the parts of the state. Just waiting for the day when the common man realizes that we can't change these politicians and takes care of them for good.

    ReplyDelete