అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Wednesday, June 12, 2013

"ఇండియన్ పైసా లీగ్" ఐపిఎల్‌లో ఆట తప్ప అన్నీ ...!!


మొట్టమొదట బిడ్డింగ్‌ పేరుతో క్రికెటర్లను సంతలో పశువుల్లా వేళం వేసినప్పుడే అర్థమయి ఉండాల్సింది. క్రికెట్‌ అంటే తెలియని వారు డబ్బు మధంతో భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు చేసిన దిగ్గజ క్రికెటర్లను కనీసం పరిగణలోకి తీసుకోకుండా అవమానించినప్పుడే నిలదీయాల్సింది. ఐపిఎల్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ అవినీతి కూపంలో కొట్టుకుపోయినప్పుడే బండారాల కూపీలాగి నిలిపేయాల్సింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నగా, అత్యంత ధనిక బోర్డుగా, ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐ అధ్యక్షున్ని ఒక లీగ్‌ కారణంగా పదవి నుండి దించేశారు. కానీ ఆ లీగ్‌ వంక కన్నెత్తి చూడట్లేదు. పల్లెత్తుమాట అనట్లేదు. ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) వల్ల ప్రయోజనం ఎంత..? నష్టం ఎంత..?? ఎవరి అండదండలతో ఈ లీగ్‌ మనుగడ సాగిస్తోంది..???
క్రికెట్‌ ఉద్ధరణకేనా...?

బడా కార్పొరేట్లు ప్రాంచైజీలుగా మారి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక్కో టీంను కొనుకున్నది క్రికెట్‌కు సేవ చేయడానికా..!!! అంబానీ పనులు మానుకుని కుటుంబంతో వచ్చి క్రికెట్‌ చూసినా, మాల్యా కొడుకుతో పోటీపడి మేకప్‌ అయి వచ్చి డ్యాన్స్‌ చేసినా, అన్నీ వారి వ్యాపారంలో భాగమే. సాధారణ అభిమానికి క్రికెట్‌ ఒక మతం కావచ్చు, క్రికెటర్లు దేవుళ్లు కావచ్చు, కానీ ఈ బడా కార్పొరేట్లకు మత్రం అన్ని వ్యాపారాల మాదిరిగానే ఈ ఐపిఎల్‌ కూడా ఒక బిజినెస్సే. ఏ వ్యాపారి లక్ష్యమైనా ఒక్కటే లాభాల్ని గరిష్టం చేసుకోవడం. కాబట్టి ఇది లాభసాటి వ్యాపారమే కాకుండా తమ కార్పొరేట్‌ సామ్రాజ్యానికి ఇంకొద్దిగా సొబగులద్ది ప్రపంచానికి ప్రచారం చేసే సరైన వేదిక. తక్కువ ధరలో ఎక్కువ పబ్లిసిటీ దొరికే చక్కటి ప్రదేశం. ఈ రెండు నెలల కాలం చాలు సంవత్సరమంతా వారి ఉత్పత్తులు అమ్ముడయ్యేందు. ఈ సమయంలోనే సాధ్యమైనన్ని రకాలుగా వారి వస్తు, సేవలను ప్రమోట్‌ చేసుకుంటున్నారు. ఛీర్‌గర్ల్‌ మిడ్డీల నుండి, గ్రౌండ్‌ బాయ్స్ టీషర్టుల వరకూ దేన్నీ వదలకుండా, ఇందుగలవందులేవనకుండా అంతటా తమతమ ఉత్పత్తుల చిత్రాలు నింపేసి టీవిలు, పేపర్లు, ప్రసారమాద్యమాల నిండా ఎనలేని పబ్లిసిటీ కల్పించుకుంటారు. వీరికి క్రికెట్‌ ఓనమాలు తెలియకున్నా క్రికెట్‌కు పిచ్చి అభిమానులున్న భారత దేశంలో దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని గొర్రెల్ని చేసి ఏ విదంగా వ్యాపారం చేసుకోవాలో వెన్నతో పెట్టిన విద్య.
భావి క్రికెటర్లకు ఏం నేర్పుతోంది..?

ఐపిఎల్‌ యువ క్రీడాకారులను వెతికిపట్టి వారి శక్తిసామర్థ్యాలు వెలికి తీసే ఒక వేదిక. భవిష్యత్‌ భారత్‌కు మెరికల్లాంటి క్రికెటర్లను ఇచ్చే ఒక ఉత్పత్తి కేంద్రం అని గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ అందులో ఎంతమంది క్రికెటర్లు క్రికెట్‌ విలువల్ని పాటిస్తున్నారు. యువక్రికెటర్లు ఈ లీగ్‌ ద్వారా ఏం నేర్చుకుంటున్నారు?.
2012లో ఇండియాటివి నిర్వహించిన స్ట్రింగ్‌ ఆపరేషన్లో ఐదుగురు యువ క్రికెటర్లు స్పాట్‌ ఫిక్సింగ్‌లో దోషులుగా తేలారు. సుదీంద్ర (డెక్కన్‌ ఛార్జర్స్‌), మోహినిష్‌ మిశ్రా (పూణే వారియర్స్‌) అమిత్‌యాదవ్‌, షలబ్‌ శ్రీవాత్సవా(కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌) అభినవ్‌ బాలి (ఢిల్లీ క్రికెటర్‌). 2013లో ఆ ఫిక్సింగ్స్‌ భూతం మరొక్కసారి కోరలు విప్పింది. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఆటగాళ్లు ముఖ్యంగా భారత క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన శ్రీశాంత్‌, ఇంకా యువ క్రికెటర్లు అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాలు స్పాట్‌ ఫిక్సింగ్‌లో పట్టుబడ్డారు.
మీద మీద తవ్వితే దొరికిన ఎలుకలు ఇవి. మరి తవ్వని కలుగులు ఎన్నో బయటపడని పందికొక్కులు ఇంకెన్నెన్నో. బిసిసిఐ అధ్యక్షుడి అల్లుడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజీల్లో ఒకరైన గురునాథ్‌ అయ్యప్పన్‌ ఇదే ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని ప్రాంచైజీ నుండి తొలగించి చేతులు దులుపుకున్న ఐపిఎల్‌ యాజమాన్యం. ఆవు చేలో మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా అన్న సామేత మరిచినట్టున్నారు. ఫిక్సింగ్‌కు పాల్పడ్డ యజమాని ఆటగాళ్ళను ప్రభావితం చేయకుండా ఉన్నాడా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ప్రాంచైజీ శిల్పాశెట్టి భర్త, రాజ్‌ కుంద్రా తను బెట్టింగ్‌కు పాల్పడ్డానని బహిరంగంగా ఒప్పేసుకున్నాడు. దొరికిన దొంగల సంగతి అటుంచితే మరి దొరకని వారి సంగతి పెరుమాళ్లకెరుక.
ఇదేనా టీం స్పిరిట్‌..?
ఒక అంతర్జాతీయ జట్టు సభ్యుల మధ్య ఎంత సఖ్యత, ఐక్యత ఉంటే జట్టు అంత మంచి విజయాల్ని అందుకుంటుంది అన్నది క్రీడా సూత్రం. కానీ ఈ టోర్నీ కారణంగా భారత క్రికెట్‌ జట్టు సభ్యులు తాము ఒకే జాతీయ జట్టు సభ్యులం అన్న విషయం మర్చిపోయి. ఐపిఎల్‌ జట్లకోసం బహిరంగంగా తమ సహచర ఆటగాళ్లతో వాగ్వాదాలకు దిగారు. గంభీర్‌, కోహ్లీల గొడవ చూస్తే ఏకంగా కొట్టుకునేంత పనిచేశారు. మరో మ్యాచ్‌లో గంభీర్‌, ద్రావిడ్‌తో వ్యవహరించిన తీరుతో సీనియర్‌ క్రికెటర్లకు ఇచ్చే గౌరవం ఇదా..? అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఇవి మచ్చుకు కొన్ని. మరి యువక్రికెటర్లు వీటి నుండి ఏం పాఠం నేర్చుకోవాలి. భవిష్యత్‌ భారత్‌ను ఇదేనా మార్గదర్శకం.??
ఈ ప్రాంతీయ యావ ఎంత వరకు వచ్చిందంటే ఈ వివాదాల కారణంగా ప్రేక్షకులుకూడా క్రికెట్‌ను క్రికెట్‌లాగా చూడకుండా వారి స్థానిక జట్లకు మద్ధతిస్తూ, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇతర ఐపిఎల్‌ జట్ల క్రీడాకారులను హేళన చేసేంతలా ప్రభావితం చేయబడ్డారంటే ఇది ఎవరి చలవ.
అశ్లీలం
ఛీర్‌ గర్ల్స్‌తో కురచ దుస్తువులు ధరింపజేసి, చిందులేయించే సాంప్రదాయం ఈ ఐపిఎల్‌ పుణ్యమా అని మన దేశానికీ వచ్చింది. మహిళను గౌరవించే భారత దేశంలో సాంప్రదాయాలకు తిలోదకలద్ది. హంగులూ ఆర్భాటాలకు ప్రాదాన్యమిస్తూ చేస్తున్న ఈ రంగుల వలయంలో అబలను ఆటబొమ్మగా మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.? అభిమాని గ్రౌండ్‌కు వెళ్లేది ఫోరు కొట్టినప్పుడు, వికెట్‌ తీసినప్పుడు అసలైన క్రికెట్‌ మజా ఆస్వాదించడానికా..? లేక ఈ ఛీర్‌గర్ల్స్‌ నృత్యాలు వీక్షించడానికా..?. ఈ లీగ్‌లో ఫిక్సింగ్‌కు పురిగొల్పడానికి అమ్మాయిలను ఎరవేసి యువ క్రికెటర్లను రొంపిలోకి లాగామని పట్టుబడ్డ బూకీలు బహిర్గతపర్చిన సంగతి తెలిసిందే.
అరాచకం

ఒక క్రికెటర్‌ చిన్న తప్పిదం చేస్తే మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తారు. రెండు, మూడు మ్యాచ్‌లు ఆడకుండా నిషేదిస్తారు. కొన్ని తప్పులకు జీవితకాలం శిక్ష విధిస్థరు. అలాంటిది క్రికెట్ ఓనమాలు తెలీని ఒక జట్టు ప్రాంచైజీ గ్రౌండ్‌లో అందరిముందు గ్రౌండ్‌ బాయ్స్ పైన చేయి చేసుకున్నాడంటే అది క్రికెట్‌కే అవమానం కాదా.? దీనికి సరిఅన్ శిక్ష ఆ ప్రాంచైజీ యాజమాన్యాన్ని రద్దు చేయడం. దెబ్బతిన్న వ్యక్తిని ఒక గ్రౌండ్ బాయ్ గా కాకుండా క్రికెట్ ప్రథినిధి గా చూడాలి. దురుసు గా ప్రవర్తించిన ఘనున్ని మరే గ్రౌండ్‌లో అడుగుపెట్టనీయకుండా చేయాలి. కానీ రాజకీయాలు రాజ్యమేలాయి తిమ్మిని బమ్మి చేశారు. చివరకు ఆ గ్రౌండ్‌ వారు పట్టుబట్టడంతో ఒన్నో ఒత్తిడిల మధ్య ఆ మైదానంలోకి మాత్రం రాకుండా నిషేధించారు. ఇదే అన్ని మైదానాలకు వర్తింపజేయరెందుకు.??

చెట్టును వదిలేసి రాలిపోయిన కాయల్ని చూపిస్తున్నారెందుకు...?
కార్పొరేట్‌ మీడియాకు కూడా ఐపిఎల్‌ ఒక పండగే. ఈ రెండు నెలల్లో ప్రసార మాద్యమాలనిండా ఈ లీగ్‌ ముచ్చట్లే. ఇది అమాంతం రేటింగ్‌ పెంచేసే బంగారు బాతు మరి. దీని బండారం బయటపెట్టేందుకు మనసెలా ఒప్పుతుంది. మన కార్పొరేట్‌ మీడియాకి స్వలాభం తప్ప ప్రజాహితం గురించి ఆలోచించే కనీస సామాజిక బాధ్యత ఉంటే కదా..!! అందుకే ఐపిఎల్‌లో అవినీతి జరిగిందీ అంటే అధికారుల తప్పు. ఫిక్సింగ్‌ జరిగిందీ అంటే ఆటగాళ్లతప్పు. బిసిసిఐ అధ్యక్షుడు రాజీనామా చేశాడంటే అది అతని అల్లుడి తప్పుకు బాధ్యత వహిస్తూ తీసుకున్న నిర్ణయం. ఇలా రకరకాల కోణాల్లో వార్తలను వర్ణించి విశ్లేషిస్తూనే, అసలు వీటన్నింటికీ మూల కారణం అసంబద్ధమైన విలువలతో నడిచే ఐపిఎల్‌ అనే విషయాన్ని కనీసం కనబడనీయకుండా చాలా చాకచక్యంగా కవర్‌ చేస్తున్నారు కర్పోరేట్‌ మీడియా వాళ్లు.
ఇక చివరగా ఈ ఐపిఎల్‌లో అవినీతి గురించి మాట్లాడమంటే దేశ ప్రధాని గారు చెప్పిన సమాధానం ''ఆటను ఆటగా చూద్దాం'' అని. దేశంలోనే అత్యంత ఖరీదైన క్రీడ, దేశ జనాభాలో ఎక్కువ శాతం మందిని ప్రభావితం చేస్తున్న ఈ ఆటలో అవినీతి, అరాచకాలు ఆటలాడుతుంటే చూస్తూ కూర్చుందామని ఉపదేశాలిస్తున్నారు. జాతీయ క్రీడ హాకీ కనీస ఆదరణకు నోచుకోకుండా ఉంది. దేశంలో అనేక గ్రామీణ క్రీడలు కనుమరుగైపోతున్నాయి. అవి వీరి చూపుకు ఆనవు కానీ ఇక్కడ అవినీతి గురించి మాట్లాడే సరికి వేదాంతాలు తన్నుకొస్తారు. ''బడా కార్పొరేట్‌ దిగ్గజాలన్నీ ఒక్కో ప్రాంచైజీ రూపంలో వచ్చి ఈ లీగ్‌లో చేరాయి. అంబాని లాంటి ఒక్క కార్పొరేట్‌ను ఎదుర్కొని నిలబడడమే చేతకాదు. అలాంటిది భారత దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేసే బడా కార్పొరేట్ల గుంపుకు ఎదురొడ్డి నిలవలేను. నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేను''. అని సూటిగా చెప్పలేక ఈ మన్మోహన నంగనాచి జవాబులు కాదంటారా..!!
క్రికెట్‌ జంటిల్మన్‌ గేమ్‌ అంటారు. మరి ఐపిఎల్‌తో క్రికెట్‌ అర్థం పరమార్థం మారిపోయింది. ఐపిఎల్‌ లో ఆట తప్ప హంగూ, ఆర్భాటం, అశ్లీలం, ఆర్థిక అరాచకం అన్నీ ఇంపుగా ఉన్నాయి. ఇందులో అర్థ భాగాన్ని మాత్రమే నిశబ్దంగా చూస్తున్న అమాయకులు ఈ అభిమానులు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు రెండో భాగం చూడాల్సి వస్తుంది. ఆ రోజు గొర్రెలు గాండ్రించే బొబ్బిలులౌతాయ్. ఒక క్రికెటర్‌ తప్పు చేస్తే అతని ఫొటోకు చెప్పుల దండేసి, నామంబొట్లు పెట్టి గాడిదమీద ఊరేగిస్తున్నారని టివీల్లో పేపర్లలో చూస్తున్నాం. అసలు ఆ తప్పులకు మూలకారణం ఏంటో...? తమ అభిమానం.. ఆత్మాభిమానం.. విశ్వాసం,  ఉద్వేగాలతో ఆటలాడుతూ, అవినీతి, అక్రమాలతో నిర్మించబడ్డ ఇలాంటి కార్పొరేట్‌ లీగ్‌ బండారం బయటపడితే
 
సగటు అభిమాని ఆవేశానికి కొట్టుకుపోకుండా తట్టుకుని నిలబడగలవా ఈ మాయాలీగ్‌లు...??
సుందర్

No comments:

Post a Comment