అనునిత్యం పరిశ్రమించు కాలం లా ....

Saturday, October 30, 2010

దేశం నిండుగ దీపాల పండుగ

దసరా వెంట వచ్చే ప్రధానమైన పండుగ దీపావళి. మరే పండుగకూ లేని ప్రత్యేకత ఒకటి దీపావళికి వుంది. అమావాస్య చీకట్లను తరిమివేసే రంగురంగుల కాంతులే దీని స్పెషల్‌. పెద్ద పెద్ద శబ్దాలు చేసే టపాసులు, అందాలు విరజిమ్మే తారాజువ్వలు, క్షణానికోచోట నాట్యం చేసే భూచక్రాలు, ఆకాశాన్ని ముద్దాడాలని ముచ్చటపడే చిచ్చుబుడ్లు .... దీపావళిని జనరంజకమైన పండుగగా చేస్తాయి. దేశవ్యాప్తంగా చిన్నారులకే కాక పెద్దలకూ అత్యంత ఇష్టమైన పండుగ ఇది. మనది వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కనుక సంక్రాంతినే అత్యంత ప్రధానమైన పండుగగా జరుపుకుంటాం. దీపావళిని ఒక్కరోజులోనే ముగించేస్తాం. కానీ ఈ పండుగను ఐదేసి రోజుల పాటు జరుపుకునే రాష్ట్రాలున్నాయి. మరి మన పొరుగు రాష్ట్రాలవారు ఈ పండుగను ఎలా చేస్తారో చూద్దామా...
చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నమే దీపావళి. సాధారణంగా అక్టోబర్‌-నవరబర్‌ మధ్యలో వస్తుంది. అప్పుడే శీతాకాలం మెల్లగా మొదలౌతుంటుంది. ఎండ వానల తర్వాత వచ్చే ఈ చల్లటిగాలులు ఆహ్లాదకరంగానే వుంటాయి. సరిగ్గా ఈ సమయంలో దీపాల పండుగ జరుపుకోవడం ఎంతో అద్భుతం. చిన్నారులైతే ఏమేం టపాసులు కొనాలి? ఏం చేయాలో? ముందుగానే ప్రణాళిక వేసుకొంటారు. బాణాసంచా కొన్న దగ్గరనుంచి వాటిని ఎండబెట్టుకొంటూ ఎప్పుడెప్పుడు కాలుద్దామా అని ఉవ్విళ్లూరుతుంటారు. పండుగరోజు తెల్లవారుఝామునే లేచి నరకుణ్ణి కాల్చుతారు. తర్వాత స్నానాదికార్యక్రమాలు ముగించుకొని కొత్తబట్టలు వేసుకొని తీపి పదార్థాలు ఆరగించి సాయంత్రం ఎప్పుడౌతుందా అని ఎదురుచూస్తుంటారు. మట్టి ప్రమిదలు వెలిగించి గుమ్మాల పక్కన, గోడలమీద పెడతారు. లక్ష్మీపూజ చేస్తారు. చీకటిపడ్డాక టపాసులు కాల్చేటప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. మన రాష్ట్రంలో సంగతి ఇది. మరి మన పొరుగు రాష్ట్రాలలో దీపావళిని ఎలా ఆస్వాదిస్తారో చెప్పుకుందాం!
టీ తోటలకు పేరుగాంచిన అస్సాంలో దీపావళిని మట్టి ప్రమిదలు, మిఠాయిలు, టపాసులతో జరుపుకొంటారు. ఇంటిల్లపాదీ పెందలాడే లేచి స్నానాలు ముగించి కొత్తబట్టలు ధరిస్తారు. అష్ట ఐశ్వర్యాలను అందించమని లక్ష్మీదేవిని పూజిస్తారు. సాయంత్రం అయిన దగ్గర నుంచి ఇంటిని చిన్ని చిన్న విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. మట్టిదీపాలుకూడా వెలిగిస్తారు. అంతేకాకుండా ఇంటి బయట దీపాలను వేళ్లాడదీస్తారు. ఇవి దుష్టశక్తులను అడ్డుకుంటాయని, అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తాయని విశ్వసిస్తారు. ఇంటి గుమ్మాలను మామిడాకులు, బంతిపూల తోరణాలతో అలంకరిస్తారు. అతిథులను ఆహ్వానించడానికి వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు వేస్తారు. వ్యాపారాలు చేసుకొనేవారు ఆరోజునే కొత్త పొద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు. నూతనంగా చేపట్టే పనులేవైనా వుంటే ఆరోజునే మొదలెడతారు.

బీహార్‌లో రెండు రోజుల ముందరే దీపావళి వేడుకలు మొదలౌతాయి. ధన త్రయోదసి రోజున నూతన వంటపాత్రలు తీసుకొచ్చి పూజగదిలో వుంచుతారు. ఉదయం స్నానాలు చేసిన దగ్గరనుంచి ఉపవాసం వుంటారు. సూర్యాస్తమయం తర్వాతే మిఠాయిలు, పూరీలు వంటి రుచికరమైన వంటకాలను సుష్టుగా భుజిస్తారు. దీపావళి ముందు రోజును చిన్న దీపావళిగా పిల్చుకుంటారు. ఆరోజున నామకః టపాసులు కాల్చుతారు. మరునాడు ఇంటిని అందంగా అలంకరిస్తారు. వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తారు. వరిపిండితో చిన్న చిన్న పాద ముద్రలు వేస్తారు. వాటిని లక్ష్మీదేవి చిహ్నాలుగా భావిస్తారు. ధనలక్ష్మి అలా ఆ పాదముద్రలమీదగా తమ ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. నెయ్యి, నూనెతో మట్టి దీపాలు వెలిగిస్తారు. పూజ అనంతరం వీటిని తులసి కోట ముందు, ప్రతి గుమ్మానికి ఇరువైపుల, ఇంటి చుట్టూ అలంకరిస్తారు. అనంతరం నేస్తాలను కలుసుకొని మిఠాయిలు పంచి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇక చివరి కార్యక్రమంగా టపాసులు కాల్చి ఆనందిస్తారు.
రాజధాని ఢిల్లీలో దసరా అప్పుడే దీపావళి ఏర్పాట్లు మొదలౌతాయి. ఇళ్లను, షాపులను తిరిగి అలంకరించడం, సున్నాలు కొట్టించడం...షాపింగ్‌ చేయడంతో అంతా హడావిడిగా వుంటుంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడంతో షాపులు కిటకిటలాడతాయి. దీపావళిరోజున ధరించడానికి కొత్త బట్టలు కొనుగోలు చేస్తారు. ఇక్కడ కూడా ధన్‌తేరస్‌ రోజున వంట సామాను కొంటారు. దీపావళి రోజున మధ్యాహ్నం వరకు షాపులు తెరచే వుంటాయి. ఆరోజున అమ్మకాలు బాగా వుంటే సంవత్సరమంతా వ్యాపారం బావుంటుందని నమ్ముతారు. మిఠాయిలు, ఎండు ఫలాలు, వెండి నాణేలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ బహుమతులు స్థాయినిబట్టి వుంటాయి. వెండి వస్తువులు, ఇంటి సామగ్రి, బట్టలు కూడా ఇచ్చుకునేవారుంటారు. ప్రతి వీధి చివరన రామలీల గాథకు సంబంధించిన విగ్రహాలను వుంచుతారు. దీపావళి రోజున మహిళలు భర్తకు తిలకం దిద్ది హారతి ఇస్తారు. అతని దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. పాలు నింపిన పాత్రలో వెండి నాణెం వేసి...ఆ పాలను అన్ని గదుల్లోను చిలకరిస్తారు.
పంజాబ్‌లో మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా దీపావళి జరుపుకొంటారు. ఏర్పాట్లు ముందుగానే జరిగిపోతాయి. జిలిబిలి వెలుగుల దీపాలతో కళ్లు జిగేల్‌మంటాయి. సంప్రదాయ ముగ్గులతో ఇంటిలోగిళ్లు శోభాయమానమౌతాయి. సంపదలను అందించమని లక్ష్మీదేవిని వేడుకొంటారు. గ్రామాలలో మాత్రం ఆరోజున పశువులను పూజిస్తారు. శీతాకాలపు పంటలు చేతికందుతాయి కనుక దీపావళిని టిక్కా పండుగగా జరుపుకుంటారు. ఎటువంటి చెడు జరగకుండా ఆరోజున అప్పచెల్లెళ్లు సోదరులకు కుంకుమ దిద్దుతారు. ఇంక టపాసుల సంగతి చెప్పేదేముంది!
ఒరిస్సాలో కూడా అందరికిలాగే దీపావళి పండుగను ఆస్వాదిస్తారు. కొవ్వొత్తులు, మట్టిదీపాలు, విద్యుత్‌ దీపాలు, మిఠాయిలు, టపాసులు అన్నీ వుంటాయి. కాకపోతే ఇక్కడో ప్రత్యేకత వుంది. ఆరోజున చీకటిపడిన వెంటనే కుటుంబ సభ్యులంతా ఒకచోటికి చేతారు. వాకిట్లో పడవ ముగ్గు వేస్తారు. అందులో ఏడు గదులుంటాయి. పత్తి, ఉప్పు, పసుపు, ఆవాలు, చెట్టు కొమ్మ, తోటకూరను ఒక్కో గదిలో వుంచుతారు. మధ్య గదిలో ప్రసాదం పెడతారు. దానిమీద గుడ్డ ముక్క కట్టిన జనుము కొమ్మను వెలిగిస్తారు. ప్రతి ఒక్కరూ వెలిగించిన జనుము కొమ్మను ఆకాశంవైపు చూయిస్తూ 'బడా బడువా హో...' అంటూ పాట పాడతారు. సూక్ష్మరూపంలో తమను చూడ్డానికి వచ్చిన పితృదేవతలను ఈ వెలుగు తిరిగి స్వర్గానికి తీసుకెళ్తుందని నమ్ముతారు.

రాజస్థాన్‌ అంటేనే పండుగులకు, పర్వదినాలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రధానమైన పండుగలలో దీపావళి ఒకటి. గృహాలంకరణ, మిఠాయిలతోపాటు మిత్రులను కలవడం కూడా వుంటుంది. స్నేహితులంతా కలిసి రొటీన్‌కు భిన్నంగా ఆనందోత్సాహాలతో గడుపుతారు. సాధారణంగానే ఆరోజుటి వంటకాల జాబితా ఎక్కువగానే వుంటుంది. మహిళలు ఇరుగుపొరుగుతో కలిసి మిఠాయిలు వండుతారు.
మహారాష్ట్రలో దీపావళి మిగతారాష్ట్రాలకు భిన్నంగా జరుపుకొంటారు. మరాఠీ క్యాలండర్‌ ప్రకారం 'వసు బరస్‌' రోజున దీపావళి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఆరోజున వివాహితలు గోపూజ చేస్తారు. తమను, తమ సంతానాన్ని కాపాడుతున్నందుకుగాను అలా వాటిని పూజిస్తారు. ధనత్రయోదసిని ఇక్కడ ధన్‌ తేరస్‌ అని పిలుస్తారు. ఈరోజున యమ దీప దానం చేస్తారు. సాయంత్రంపూట దీపం వెలిగించి యముడిని పూజిస్తారు. భర్తలకు సంపూర్ణ ఆయుష్షు ప్రసాదించమని వేడుకొంటారు. చిన్న దీపావళిని నరకచతుర్దసిగా పిల్చుకుంటారు. ఆరోజున అభ్యంగన స్నానమాచరిస్తారు. చందనం, రోజాపూలు, పసుపుతో చేసిన పిండితో స్నానం చేస్తారు. సబ్బు ఉపయోగించరు. దీపావళి నాడు లక్ష్మీపూజ చేస్తారు. ఆ సాయంత్రం తమ సంతోషానికి గుర్తుగా భర్త భార్యకు ఏదైనా చక్కటి బహుమతిని అందిస్తాడు. చివరి రోజున తమ సోదరులకు దీర్ఘాయుష్షును కోరుతూ ఆడపిల్లలు పూజలు చేస్తారు. దీనికి బదులుగా అబ్బాయిలు తమకు కలిగినంతలో వారికి బహుమతులు అందిస్తారు. దీపావళి ముగింపు ఉత్సవం తులసిచెట్టు వివాహంతో మొదలౌతుంది.
గుజరాత్‌లో దీపావళిని ఐదు రోజులపాటు జరుపుకుంటారు. తొలిరోజున ధన త్రయోదసి, రెండవరోజున కాళి చౌదాస్‌, మూడవ రోజున దేవ దివాళి, నాల్గవ రోజున గుడి పడ్వా, ఐదవ రోజున భాత్రు ద్వితీయ చేస్తారు. సంపదలు అందించే లక్ష్మీపూజ తప్పనిసరి. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. వరి పిండి, పసుపుతో పాదముద్రలు వేస్తారు. ఇంటిని దీపాలు, పూలు, రంగు కాగితాలతో అలంకరిస్తారు. ఆ నెల మొత్తం షాపులన్నీ కస్టమర్లతో నిండుగా వుంటాయి. నాల్గవరోజునే వారు నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకొంటారు. దీపావళి రోజున స్త్రీపురుషులు తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.
ఇలా ప్రతి రాష్ట్రంలోనూ దీపావళిని జరుపుకొంటారు. విశ్వాసాలు, నమ్మకాలు వేరైనా అంతా కోరుకొనేది ఒక్కటే. ఐశ్వర్యారోగ్యాలే. సంపదకోసం, ఆయుష్షుకోసం పూజలు చేయడం మనకు కనిపిస్తుంది.

ఏ దేశమేగినా...


ఏ దేశంలోనైనా దీపావళి దీపావళే. కాకపోతే ఆచార వ్యవహారాల్లో తేడాలుండొచ్చు. అలాగే ఆచరించే తేదీల్లోనూ మార్పులుండొచ్చు. కానీ ఆనందోత్సాహాల్లో మాత్రం కూసింత కూడా తేడా వుండదు. మరి దీపావళిని ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో చూద్దామా!
పడవ షికారు
జపాన్‌లో దీపావళి పండుగ సెప్టెంబర్‌ మాసంలో వస్తుంది. ఇది తమకు అష్ట ఐశ్వర్యాలను తీసుకొస్తుందని జపనీయుల నమ్మకం. ఆ రోజున వారు తోటల్లోకెళ్లి చెట్ల కొమ్మలకు లాంతర్లు వేళ్లాడదీస్తారు. తెల్లవార్లూ ఆటపాటలతో గడుపుతారు. కొత్త బట్టలు వేసుకొని పడవ షికారు చేయడం వారి ఆచారం. తమాషా ఏంటంటే పండుగనాడు మాత్రం ఇంటిని శుభ్రం చేయరు. వాల్‌పేపర్లతో అలంకరిస్తారు.
మనలాగే...
మారిషస్‌, మయన్మార్‌లలో మాత్రం దీపావళిని మనలాగే పర్వదినంగా భావిస్తారు. రాముడు పట్టాభిషిక్తుడయ్యాడని చెప్పుకొనే రోజుకి ముందే ఈ పండుగ చేసుకొంటారు. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. వీటితో రకరకాల ఆకృతులూ చేస్తారు. లక్ష్మీదేవిని పూజించి టపాసులు కాల్చుతారు.
5 రోజుల పండుగ
నేపాల్‌లో దీపావళిని తిహార్‌గా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు చేస్తారు. తొలి రెండు రోజులు కుక్కలకు మంచి ఆహారాన్ని పెడతారు. హంసల్ని మాత్రం భైరవుడికి ప్రతిరూపంగా భావిస్తారు. ముచ్చటగా మూడవ రోజు మట్టి దీపాలతో ఇళ్లను అలంకరిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తారు. నాల్గవ రోజున యముడిని వేడుకొంటారు. చివరి రోజున కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడుపుతారు.
క్రియోకా...
థారులాండ్‌లో అక్టోబర్‌ - నవంబర్‌ నెలలో ఈ పండుగను ఇకయోకా పేరుతో జరుపుకొంటారు. అరటి ఆకుల్ని దొప్పలుగా చేసి కొవ్వొత్తులు వెలిగిస్తారు. ధూపం వేసి వాటిని నీళ్లల్లో వదులుతారు. నాణేలనూ నీటిలో వేస్తారు.
శుభాకాంక్షలు తెలుపుకొంటూ మిఠాయిలు పంచుకొంటారు.

ఐదు రోజుల పండుగ 'కథా'కళి


దీపావళి అనేక ప్రాంతాల్లో ఒక్కరోజు టపాసుల మోతలకే పరిమితమైనా...కొన్ని చోట్ల మాత్రం ఏకంగా ఐదు రోజులు సాగే పండుగ. ఒక్కో రోజుకు ఒక్కో కథ. అంతేనా! ఒక్కో పూజ. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొనే పండుగకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. మరి ఆ కథలేంటో...ఏ రోజున ఏ పూజను ....ఎక్కడెక్కడ ఏవిధంగా చేస్తోరో... చూద్దాం.
తొలిరోజు ...ధన త్రయోదశి
దీపావళి తొలిరోజును ధన త్రయోదశి అంటారు. క్షీరసాగర మధనంలో అమృతభాండాన్ని తీసుకొని బయటకు వచ్చిన దేవతల వైద్యుడు ధన్వంతరిని ఈరోజు కొలుస్తారు. అనారోగ్యం, మరణం లేని అమృతాన్ని అందించినందుకు ధన్వంతరని పూజిస్తారు. మరో కథ కూడా ప్రచారంలో వుంది. హిమరాజ కుమారుడిని యముడి పాశం నుంచి కాపాడుకోవడానికి అతని భార్య ప్రయత్నించి విజయం సాధిస్తుంది. అందుకుగాను తన నగలన్నీ గుట్టగా పోసి వాటి చుట్టూ లక్షలాది దీపాలు వెలిగిస్తుంది. అందుకే ఈ రోజున ఏదైనా బంగారు ఆభరణాలు కొనడాన్ని శుభసూచికంగా భావిస్తారు.
రెండవరోజు...నరకచతుర్దశి
దీపావళి రెండవరోజును నరకచతుర్దశి లేదా చిన్న దీపావళి అంటారు. ఈరోజు వెనక ప్రచారంలో వున్న గాథ అందరికీ తెలిసిందే. నరకాసరుడి బాధలు పడలేక ప్రజలు శ్రీకృష్ణుడిని వేడుకోగా...సత్యభామా సమేతంగా యుద్ధానికి వెళతాడు. ఆ యుద్ధంలో సత్యభామ నరకుణ్ణి వధిస్తుంది. అందుకు ప్రతీకగా నరకచతుర్దశిని జరుపుకుంటాం.
మూడవరోజు...లక్ష్మీపూజ
దీపావళి పర్వదినాలలో అత్యుత్తమమైనది మూడవరోజు. అదే దీపావళి. ఈరోజునే లక్ష్మీపూజ జరుపుకుంటారు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం అనంతరం సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన రోజును దీపావళి అని కూడా అంటారు. పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేసుకుని తిరిగి వచ్చింది కూడా దీపావళి రోజునే అని అంటారు. ఈరోజు అమావాస్య అయినప్పటికీ ఎంతో విశిష్టత వున్న పర్వదినంగా పాటిస్తారు.
నాల్గవరోజు...గోవర్థన పూజ
దీపావళి మరుసటి రోజును 'పాడ్‌వా లేక వర్షపాద' అని అంటారు. ఇది విక్రమాదిత్యుడు పట్టాభిషిక్తుడైన రోజుగా చెప్తారు. ఆరోజునే విక్రమాదిత్యుడి యుగం ప్రారంభమైనట్టుగా కూడా అంటారు. దీన్ని పురాణాల ప్రకారం గోవర్థన గిరిని కృష్ణుడు ఎత్తిన రోజుగా కూడా భావిస్తారు.
ఐదవ రోజు...భ్రాతృద్వితీయ
చివరి రోజు అయిన ఐదవ రోజున 'భావ్‌ బిజ్‌ లేక భయ్యా దూజ్‌' (భ్రాతృ ద్వితీయ)గా జరుపుకుంటారు. ఇది తోడబుట్టిన వారితో ప్రేమానురాగాలను పంచుకొనే రోజు. దీని వెనకా ఓ పురాణగాథ ప్రచారంలో వుంది. ఇదే రోజున యముడు తన సోదరి యమి ఇంటికి వెళ్లగా ఆమె ఆయనకు తిలకం దిద్ది స్వాగతించిందట. అందుకు ఉప్పొంగిపోయిన యముడు ఒక వరమిచ్చాడట. అదేమంటే దీపావళి ఐదవ రోజున తన సోదరి చేత కుంకుమ దిద్దించుకొన్న వారి జోలికి వెళ్లను అన్నాడట. అప్పటి నుంచి సోదరసోదరీ బంధాన్ని పెంచే ఉత్సవంగా ఇది మొదలైంది.
ప్రజాశక్తి స్నేహ (ఆదివారం అనుబంధం) నుంచి సేకరించ బడినది
సుందర్

No comments:

Post a Comment